
Imam-ul-Haq Ban Buzz: పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గాయం వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశగా మారింది. ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా గాయపడినట్లు ఉత్త మాటలు చెప్పిన ఇమామ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విచారణకు సిద్ధమవుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారంలో తప్పిదం రుజువైతే.. అతడిపై రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉందని సమాచారం. ఇమామ్ విషయంలో పీసీబీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్టు తొలి రోజే ఫీల్డింగ్ చేస్తుండగా ఇమామ్ ఉల్ హక్ గాయపడ్డాడు. దీంతో రెండు ఇన్నిగ్స్‌ల్లోనూ డగౌట్‌కే పరిమితమయ్యాడు. అయితే మ్యాచ్ నాలుగో రోజు ఆటకు ముందు ఇమామ్ బ్యాట్‌తో సాధన చేస్తున్న దృశ్యాలు టీవీలో కనిపించడంతో వివాదం మొదలైంది. తనకు నిజంగానే గాయమైనట్లు తెలియాలనే ఉద్దేశంతో.. షార్ట్ ధరించి పట్టీలు వేసుకొని మరీ వార్మప్ చేశాడు. దీంతో అతడి గాయంపై అందరిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇమామ్ ఉల్ హక్ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు పీసీబీ ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం. గతంలోనూ ఇమామ్ ఇలానే గాయం అయిందంటూ నాటకాలు ఆడాడు. తాజా పరిణామాన్ని పాకిస్థాన్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. విచారణలో ఇమామ్ కావాలనే గాయం విషయాన్ని తప్పుదోవ పట్టించాడని తేలితే.. కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ వ్యవహారశైలిపైనా పీసీబీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రిజ్వాన్ క్రమశిక్షణ విషయంలో కూడా బోర్డు ఆగ్రహంగా ఉందని, భవిష్యత్తులో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. రిజ్వాన్‌ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని, భవిష్యత్తులో అతడికి జాతీయ జట్టులో చోటు దక్కడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.