
- 2020–23, 2023–26 పీజీ ఫీజుల పునఃసమీక్షకు టీఏఎఫ్ఆర్సీ ఓకే
- హైకోర్టులో రెండు స్పెషల్ అఫిడవిట్లు దాఖలు చేసిన కమిటీ
- ప్రైవేట్ కాలేజీల లెక్కలు తేల్చేందుకు 4 నెలల గడువు కోరిన టీఏఎఫ్ఆర్సీ
- ఫీజులు తగ్గితే పాత విద్యార్థులకు రీఫండ్, అడ్జస్ట్‌మెంట్‌కు చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనార్టీ, నాన్-మైనార్టీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ ట్యూషన్ ఫీజుల దోపిడీకి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. గత రెండు బ్లాక్ పీరియడ్‌లయిన 2020–2023, 2023–2026 కాలానికి సంబంధించిన పీజీ మెడికల్, డెంటల్ ఫీజుల నిర్మాణాన్ని మళ్లీ పునఃసమీక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) హైకోర్టుకు స్పష్టం చేసింది.
జీవో 20, జీవో 107 ద్వారా గతంలో ఖరారు చేసిన ఫీజులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ మేరకు టీఏఎఫ్ఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా గురువారం హైకోర్టులో రెండు స్పెషల్ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశారు. రూల్స్ ప్రకారం.. రెండు బ్లాక్ పీరియడ్‌ల ఫీజుల నిర్మాణాన్ని సమగ్రంగా పునఃపరిశీలిస్తామని పేర్కొన్నారు. కమిటీ జరిపే ఈ సమీక్షలో ఫీజులు తగ్గితే.. ఆయా బ్యాచ్‌లలో ఇప్పటికే లక్షలాది రూపాయల అధిక ఫీజులు చెల్లించిన విద్యార్థులకు ఆ మొత్తం రీఫండ్ లేదా అడ్జస్ట్‌మెంట్ రూపంలో తిరిగి దక్కే చాన్స్ ఉంది.
ఆదాయ–వ్యయాల స్క్రూటినీ..
కాలేజీల వాస్తవ ఖర్చులను తేల్చేందుకు చేపట్టబోయే కార్యాచరణను టీఏఎఫ్ఆర్సీ తన అఫిడవిట్‌లో పొందుపరిచింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల నుంచి పూర్తిస్థాయి ఆదాయ–వ్యయాల రికార్డులు, ఇతర పత్రాలు తెప్పించి, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆడిటర్ల ద్వారా స్క్రూటినీ చేయిస్తామని తెలిపింది. ద్రవ్యోల్బణం, అభివృద్ధి వ్యయాలు, విద్యార్థులకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు పెట్టిన వాస్తవ ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌కు లోబడి అనుమతించదగిన ఖర్చులను మాత్రమే గుర్తిస్తామని పేర్కొంది.
ఆడిటర్ల రిపోర్టుల తర్వాత ఆయా కాలేజీల యాజమాన్యాలకు పర్సనల్ హియరింగ్ అవకాశం కల్పించి, ఫైనల్ రిపోర్టును కమిటీ ఎదుట ఉంచుతామని వివరించింది. కాగా, 2023–2026 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి కాలేజీలు తొలుత పెంపు కోరినప్పటికీ, పర్సనల్ హియరింగ్ సమయంలో పాత ఫీజులకే కన్సెంట్ లెటర్లు ఇవ్వడం వల్ల అప్పట్లో కాలేజీల లెక్కలను లోతుగా తనిఖీ చేయలేదని వెల్లడించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్‌ఎంసీ రూల్స్ ప్రకారం లోతుగా ఆడిట్ నిర్వహించి ఫీజులను పునఃసమీక్షిస్తామని కమిటీ చెప్పింది.
నాలుగు నెలల గడువు కోరిన కమిటీ..
ప్రైవేట్ కాలేజీల నుంచి ఫైనాన్షియల్ రికార్డులు తెప్పించడం, ఆడిటర్లతో తనిఖీ చేయించడం, కాలేజీల వాదనలు వినడం, ఎన్‌ఎంసీ రూల్స్ ప్రకారం ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చును లెక్కగట్టి కమిటీ ఆమోదం పొందడానికి సాధారణంగా 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని టీఏఎఫ్ఆర్సీ కోర్టుకు నివేదించింది. అందువల్ల ఈ మొత్తం కసరత్తును పారదర్శకంగా పూర్తి చేసేందుకు తమకు కనీసం నాలుగు నెలల గడువు మంజూరు చేయాలని హైకోర్టును అభ్యర్థించింది. కాగా, సెప్టెంబర్ 1న జరిగిన విచారణ అనంతరం డివిజన్ బెంచ్ ఈ కేసులన్నింటినీ సెప్టెంబర్ 7వ తేదీకి తదుపరి విచారణ నిమిత్తం లిస్ట్ చేసింది. కమిటీ దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఇప్పుడు వైద్య వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ప్రాపర్‌గా ఆడిట్ చేసి ఫీజులు తగ్గించాలి..
రూల్స్ ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచాలంటే ముందుగా కాలేజీల ఆదాయ–వ్యయాలపై ఆడిట్ జరగాలి. గతంలో సరైన ఆడిటింగ్ చేయకుండానే అడ్డగోలుగా ఫీజులు పెంచేశారు. దీంతో లక్షలాది రూపాయల ఫీజుల భారం మోయలేక మధ్యతరగతి, పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టీఏఎఫ్ఆర్సీ ఫీజులను పునఃసమీక్షిస్తామని ప్రకటించడం మంచి పరిణామం. ఇప్పటికైనా కాలేజీల బ్యాలెన్స్ షీట్లను ఆడిట్ చేయాలి. పెంచిన ఫీజులను భారీగా తగ్గించాలి. గతంలో వసూలు చేసిన అధిక ఫీజు మొత్తాన్ని విద్యార్థులకు రీఫండ్ చేయాలి.
– డాక్టర్ కార్తీక్ నాగుల, హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్