
AP School Education Department: మెగా DSC విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది.. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని.. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.. అయితే, కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్ ఎస్‌జీటీ (తెలుగు)గా ఎంపిక, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న మీడియా కథనాలపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తును ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఇప్పటికే విచారణను ప్రారంభించి, సమగ్ర పరిశీలన కోసం సంబంధిత రికార్డులు, వెరిఫికేషన్ ఫైళ్లను తెప్పించుకున్నట్లు శాఖ పేర్కొంది. విచారణ పూర్తయి నివేదిక అందిన అనంతరం రిక్రూట్‌మెంట్, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆరోపణలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఇదిలా ఉండగా, మెగా DSC-2025 నియామక ప్రక్రియలో సంపూర్ణ పారదర్శకత, ప్రతిభ ఆధారిత ఎంపిక విధానాన్ని అవలంబించామని పాఠశాల విద్యాశాఖ పునరుద్ఘాటించింది. నియామక ప్రక్రియలో నిబంధనలను పాటించామని పేర్కొంటూ, ప్రస్తుత ఆరోపణలపై వాస్తవాలను విచారణ ద్వారా తేలుస్తామని స్పష్టం చేసింది.