
భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు, ఉద్యోగ కల్పనపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 7.8 శాతం జీడీపీ వృద్ధి సంఖ్యలపై ఆయన సూటిగా నిలదీయడం మోదీ సర్కార్ డొల్లతనాన్ని ఎండగడుతోంది. అసలు ఈ లెక్కలు నిజమేనా అని ప్రశ్నిస్తూ.. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ అంత వేగంగా ఉంటే దేశంలో యువతకు సరైన ఉపాధి ఎందుకు లభించడం లేదని రాజన్ సంధించిన ప్రశ్నలు బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి జరిగిపోతోందని, దేశం దూసుకుపోతోందని ప్రచార ఆర్భాటాలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి వాస్తవాలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. రఘురామ్ రాజన్ ఎత్తిచూపినట్లుగా.. జీడీపీ లెక్కల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని నిపుణులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో వృద్ధి రేటు నిజంగానే 8 శాతానికి దగ్గరగా ఉంటే.. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఎందుకు రావడం లేదని, పారిశ్రామికవేత్తలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని రాజన్ నిలదీశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) భారీగా రాకపోవడానికి, దేశీయ పరిశ్రమలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకపోవడానికి మోడీ ప్రభుత్వ తప్పుడు ఆర్థిక విధానాలే కారణమని స్పష్టమవుతోంది.
జీడీపీ అంకెలను పక్కన పెడితే.. అసలు ప్రశ్న దేశంలో ఉద్యోగాల సృష్టి గురించేనని రాజన్ తేల్చిచెప్పారు. దేశంలో ప్రస్తుతం యువతకు అత్యధికంగా ఉన్న జనాభా డివిడెండ్ కాలాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వృథా చేస్తోందని తప్పుబట్టారు. చదువుకున్న యువతకు మంచి ఉద్యోగాలు ఇవ్వడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని డేటా స్పష్టం చేస్తోంది. నిరుద్యోగిత రేటు పెరుగుతున్నా, ఉపాధి కల్పనపై రోడ్‌మ్యాప్ లేకపోయినా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆర్థిక విశ్లేషకులు మండిపడుతున్నారు.
ప్రస్తుత తరుణంలో సాంకేతికత, ఇతర రంగాల్లో భారతదేశం ముందుకెళ్లాలంటే పకడ్బందీ విధానాలు అవసరమని, కానీ కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజన్ విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు విఫలమవడం వల్ల దేశం భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొత్తానికిమోదీ సర్కార్ ఇస్తున్న జీడీపీ లెక్కల డొల్లతను, ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను రఘురామ్ రాజన్ బట్టబయలు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.