Reading Time: 2 minutes
Off The Record About Kcr To Attend Telangana Assembly Only As Chief Minister Ktr Comments

Off The Record: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న క్రమంలో పాత చర్చ కొత్త రూపంలో తెర మీదికి వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అని ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు చర్చ జరిగితే ఇప్పుడు మరొక అంశం తెర మీదకు వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత చర్చ మరింతగా పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేయి రోజుల పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. కేసీఆర్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా పదేపదే అంటున్నారని.. ఆయన అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రిగానే వస్తారంటూ కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.

ఇలా ఆయన మాట్లాడిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే విషయం చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ సభకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చాలాసార్లు సవాల్‌ చేయడం… రాజకీయంగా దుమారం రేపింది. ఇలాంటి సమయంలో కేటీఆర్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారంటూ కేటీఆర్‌ స్పష్టమైన రాజకీయ సంకేతం ఇచ్చారు. అంటే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌ పాల్గొనే అంశానికి గులాబీ పార్టీ ఒక లైన్‌ ఫిక్స్‌ చేసుకున్నట్టే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కేసీఆర్ 2023 ఆగస్టు వరకు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే ప్రసంగించారు. ఆ తర్వాత నవంబర్ లో జరిగిన ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడంతో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ సభలో మాట్లాడకుండా బయటికి వెళ్లి మీడియా పాయింట్ లో మాట్లాడారు. ఇక తర్వాత మరొకసారి గవర్నర్ ప్రసంగం సమయంలో అసెంబ్లీకి వచ్చిన ఆయన ప్రసంగం చివరి వరకు ఉండకుండానే వెళ్ళిపోయారు. తాజాగా గత శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ కి వచ్చిన కేసీఆర్ రెండు నిమిషాల్లోనే బయటకు వచ్చేశారు.
ఇలా ప్రతిపక్ష నేతగా నాలుగైదుసార్లు అసెంబ్లీకి వచ్చిన ఆయన ప్రతిపక్ష నేత సీట్ లో నుంచి అధ్యక్షా అనే పదం కూడా మాట్లాడలేదు.

ఇదే విషయంపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆయన గౌరవానికి ఎక్కడా భంగం కలిగించమని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఏదో ఒక రోజు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభలో మాట్లాడతారని బయట ప్రజలతో పాటు గులాబీ నేతలు కూడా ఎదురు చూశారు. ఈ సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కుండ బద్దలు కొట్టిన తర్వాత ఇక గులాబీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినా సరే కేవలం అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతారని… ప్రతిపక్ష హోదాలో మాట్లాడరని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమ నేతలు కేటీఆర్ హరీష్ రావు లు చాలని… మరోవైపు కేసీఆర్ సభలో మాట్లాడాలని చూసిన అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ సభ కు రారు అంటున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ చెప్పిన మాటలతో తమకు పూర్తి క్లారిటీ వచ్చేసింది అంటున్నారు పార్టీ నేతలు. మరొక సంవత్సరం గడిస్తే తెలంగాణలో రాజకీయ వాతావరణం ఎన్నికల వాతావరణంలోకి వెళ్లిపోతుందని… ఇక అప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే చర్చ కంటే ఎక్కువగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చర్చ ఎక్కువగా సాగుతుంది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

మొత్తానికి అసెంబ్లీ కి ముఖ్యమంత్రిగానే కేసీఆర్ అడుగు పెడతారంటూ కేటీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అంటున్నారు పార్టీ నేతలు. దీనితో రాబోయే రెండేళ్లలో అసెంబ్లీ లో కెసిఆర్ స్పీచ్ వినే అవకాశం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బిఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ తన స్పీచ్ తో నే అందర్నీ ఆకట్టుకుంటారని .. అలాంటి స్పీచ్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థానం లో నుంచి కాకుండా రాజకీయ వేదికల మీద మాత్రమే చూసే అవకాశం ఉంది. ఇలా కేటీఆర్ చెప్పినట్టు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి స్పీచ్ ఇస్తారా లేదా ..వచ్చే ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.