
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కొంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి కాంబోలో నందమూరి కల్యాణ్ రామ్ తో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘జనవరి 12 విడుదల’ (బావ బామ్మర్ది సౌజన్యంతో). ఈ విడుదల తేదీనే టైటిల్ గా పెట్టిన మూవీ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
లేటెస్ట్ గా మైసూర్ లో ఒక గ్రాండ్ సాంగ్ ను చిత్రీకరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ సారథ్యంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ కలర్‌ఫుల్ సాంగ్‌లో వెంకటేష్, కల్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొన్నారు. ఈ సాంగ్ షూటింగ్ పై నటుడు శ్రీమాన్ సోషల్ మీడియా వేదికగా తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో డాన్స్ చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు.
అయితే.. ఈ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని డ్యాన్స్ వీడియోలు, విజువల్స్ నెట్టింట లీక్ కావడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నలుగురు ప్రధాన తారాగణం ఒకే ఫ్రేమ్‌లో పండుగ వాతావరణాన్ని తలపించేలా కనిపిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే మేకర్స్ డిజైన్ చేసిన సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఇలా ముందే రివీల్ కావడం చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇదివరకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ సమయంలోనూ ఇలాంటి లీకుల సమస్య ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై కేరళలో చిత్రీకరించిన సాంగ్కు సంబంధించిన వీడియో లీక్ అయింది. దీంతో స్పందించిన చిత్రబృందం.. సోషల్ మీడియాలో లీకైన విజువల్స్‌ను షేర్ చేయవద్దని అభిమానులను కోరుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న క్లిప్పింగ్స్‌ను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా (లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డి) సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లీకుల కలకలం పక్కన పెడితే, మైసూర్ షెడ్యూల్‌తోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి..