Reading Time: < 1 minute
Nagpur Woman Dies After Husband Allegedly Assaults Her Over Dance Class Argument

Maharashtra:  మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయడానికి నిరాకరించిన భార్యపై భర్త దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆమె మరణించింది. ఈ ఘటనలో పోలీసులు భర్తను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. మృతురాలిని 38 ఏళ్ల యామిని కృష్ణ లాల్ యాదవ్‌గా గుర్తించారు. నిందితుడు 41 ఏళ్ల కృష్ణ లాల్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తనకు, పిల్లలకు భోజనం తయారు చేయాలని యామినిని కృష్ణ కోరారు. అయితే, అప్పటికే తమ హౌసింగ్ సొసైటీలోని డ్యాన్స్ క్లాస్‌కు యామిని సిద్ధమవుతోంది. దీంతో వంట చేయడానికి నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కృష్ణ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పిల్లల ముందే కృష్ణ యామని మెడ, పొత్తికడుపు ప్రాంతంలో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నొప్పి తీవ్రం కావడంతో మందులు తీసుకురావాలని యామిని కృష్ణను కోరింది. మెడికల్ షాప్‌ మూసి ఉండటంతో మందులు లేకుండా ఇంటికి తిరిగి వచ్చాడు.

ఆ తర్వాత యామిని పరిస్థితి క్రమంగా విషమించింది. అంతర్గత గాయాల కారణంగా ఆమె పొత్తికడుపు ఉబ్బడం ప్రారంభమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మరణించింది. యామిని మరణాన్ని ముందుగా పోలీసులు అనుమానాస్పద మరణంగా చూశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అంతర్గత గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. మెడ ఎముక విరిగినట్లు, పేగులకు తీవ్రమైన గాయాలైనట్లు వెల్లడైంది. దీంతో విచారణలో కృష్ణ యాదవ్ హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.