Reading Time: 2 minutes
Saha Life Of Sanju Movie Review Rating

ప్రమోషన్ల సమయంలో ‘సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా’ అంటూ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలతో పాటు కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు లాంటి ప్రముఖులు సపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న చిత్రం ‘సహా’ (లైఫ్ ఆఫ్ సంజు). టీజర్, ట్రైలర్లతో స్వచ్ఛమైన ప్రేమకథగా కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

సహా కథ:
ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేసే 40 ఏళ్ల సంజు (శివ కుమార్ కాసారం).. నిత్యం ఉదయాన్నే లేచిన దగ్గరి నుంచి తన భార్య సహా (శ్వేతా లక్ష్మణ్) జ్ఞాపకాల్లోనే బతుకుతుంటాడు. ఫోన్‌లో ఆమెతో మాట్లాడుతూనే తన గతాన్ని నెమరువేసుకుంటుంటాడు. స్కూల్ డేస్ నుంచే సహాను ప్రాణంగా ప్రేమించిన సంజు, ఆమె కోసం ఎన్నో గొడవలు పడతాడు. చివరకు సంజు ప్రేమలోని స్వచ్ఛతను చూసి సహా కూడా అతడిని ప్రేమిస్తుంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కాలేజీ పూర్తయ్యాక ఊరు విడిచి వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సహా గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు వీరిద్దరినీ మళ్లీ ఇంటికి ఆహ్వానిస్తారు. సరిగ్గా అదే సమయంలో సంజు తన ఉద్యోగం కోల్పోతాడు. ఇంటికి వచ్చే బంధువులు, తల్లిదండ్రులు సంజు సంపాదనపై సూటిపోటి మాటలు అనడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు, కలహాలు మొదలవుతాయి. ఈ గొడవల వల్ల వీరి వైవాహిక జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? వీరిద్దరి బంధం చివరకు ఏ తీరానికి చేరింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
దర్శకుడు నిశాంత్ దోటి ఎంచుకున్నది సరికొత్త కథేమీ కాదు. ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడటం, ఆమె కోసమే జీవించడం లాంటి కథలు వెండితెరపై ఎన్నో వచ్చాయి. అయితే ఈ రొటీన్ పాయింట్‌ను ఆయన ‘నాన్-లీనియర్’ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేశారు. 40 ఏళ్ల సంజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉండే వర్తమాన దృశ్యాలు, స్కూల్-కాలేజీ డేస్‌కు సంబంధించిన గతం సమాంతరంగా సాగుతాయి. ఫస్టాఫ్‌లో వచ్చే స్కూల్ లవ్, ఎంసెట్ ఎగ్జామ్ నాటి పరిణామాలు, కాలేజీలోకి ఫేక్ ఐడీతో వెళ్లే సన్నివేశాలు క్యూట్‌గా, సరదాగా సాగిపోతాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ అల్లే చిన్నపాటి డ్రామా కూడా బాగానే కుదిరింది.

సెకండాఫ్‌లో పెళ్లి తర్వాత దంపతుల మధ్య వచ్చే సమస్యలు, జాబ్ పోయిన తర్వాత ఎదురయ్యే మానసిక సంఘర్షణ, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఎమోషన్స్‌తో కథ కాస్త సీరియస్‌గా మారుతుంది. కొన్ని చోట్ల ‘7/G బృందావన కాలనీ’, ‘సినిమా చూపిస్త మావ’ ఛాయలు కనిపిస్తాయి. అయితే కథలో బలమైన మలుపులు లేకపోవడం, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో అక్కడక్కడా ఒక నిడివి ఎక్కువైన షార్ట్ ఫిల్మ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రారంభ సన్నివేశాల్లోనే ఊహించేలా ఉండటం మైనస్ అయినప్పటికీ, ముగింపులో వచ్చే ఎమోషన్స్ మాత్రం హృదయాలను బరువెక్కిస్తాయి. అయితే సినిమా బాలేకుంటే అమీర్ పేట సెంటర్లో గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేసింది హీరోయిన్, అయితే సినిమా బాలేదని అనలేం కాబట్టి ఆమె జుట్టు సేఫ్.

ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే హీరోగా శివ కుమార్ కాసారం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. స్కూల్ బాయ్, కాలేజీ స్టూడెంట్, కొత్తగా పెళ్లయిన కుర్రాడు, 40 ఏళ్ల మధ్యవయస్కుడు.. ఇలా నాలుగు భిన్నమైన వయసులకు తగిన వేరియేషన్లను బాడీ లాంగ్వేజ్, నటనలో పర్ఫెక్ట్‌గా పలికించి మెప్పించారు. శ్వేతా లక్ష్మణ్ క్యూట్ లుక్స్‌తోనే కాకుండా, ఎమోషనల్ సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించేలా పరిణతితో కూడిన నటనను కనబరిచారు. హీరో స్నేహితుడిగా హర్షవర్ధన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే సాంకేతికంగా సినిమా మంచి ప్రమాణాలతోనే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా ఉంది. రియల్ లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల విజువల్స్ సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను బాగా ఎలివేట్ చేశాయి. అయితే ఎడిటింగ్ విభాగం మరింత కత్తెర వేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. కథ పాతదే అయినా ఒక ఫీల్ గుడ్ లవ్ డ్రామాగా మలచడంలో దర్శకుడు చాలావరకు సఫలమయ్యారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్లీ : గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో ‘సహా’ ఫీల్-గుడ్ డ్రామా!