Reading Time: < 1 minute
Chadalavada Srinivasa Rao Warns Producers Guild Ntr House Comments

నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గిల్డ్ ప్యానెల్ మోసాలను బట్టబయలు చేస్తామంటూ ‘మన ప్యానెల్’ కీలక సభ్యులు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ ప్యానెల్ అధికారంలోకి రాగానే, కౌన్సిల్ నుంచి నిర్మాతల సొమ్మును గిల్డ్‌కు ఎలా తీసుకువెళ్లారో అందరికీ అర్థమయ్యేలా లెక్కలన్నీ బయటపెడతామని, రేపు తమ కౌన్సిల్ వచ్చాక గిల్డ్ సంగతి కచ్చితంగా తేలుస్తామని చదలవాడ శ్రీనివాసరావు ఘాటుగా హెచ్చరించారు. సి.కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు చదలవాడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. “కళ్యాణ్ తీసిపారేయడానికి కరివేపాకు కాదు. ఆ రోజుల్లో మద్రాస్ నుంచి వచ్చి, ప్రభుత్వ సబ్సిడీ సహకారంతో సినిమాలు తీసి ఇక్కడ ఇండస్ట్రీని సజావుగా నడిపిన నిర్మాతల్లో ఆయనొకరు” అని ప్రశంసించారు. 1990ల్లో పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇప్పుడున్న పెద్ద నిర్మాతలు ఎవరూ లేరని, నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతుతోనే పరిశ్రమ ఇక్కడకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇంటి గురించి చదలవాడ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. “రామారావు గారి కుటుంబ సభ్యులు ఎంతో నమ్మకంతో, ప్రసన్నకుమార్ గారి చొరవతో నాకు ఆ ఇంటిని అప్పగించారు. నాకు భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇంటిని అమ్మను, అక్కడ ఎలాంటి వ్యాపారం చేయను. సృష్టి ఉన్నంత వరకు కొండ పైన వెంకన్న సన్నిధి ఎంత పవిత్రంగా ఉంటుందో.. టీ నగర్‌లోని అన్నగారి ఇల్లు కూడా అలాగే ఉంటుంది” అని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. థియేటర్ల మనుగడపై చదలవాడ కీలక ప్రకటన చేశారు. థియేటర్లలో సినిమాలు ఎక్కువ కాలం (లాంగ్ రన్) ఆడేలా చూసేందుకు, తాము అధికారంలోకి రాగానే ఓటీటీ రిలీజ్ టైమ్‌లైన్‌ను కచ్చితంగా ఆరు వారాలకు కుదిస్తామని ఆయన సంచలన హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమను ధర్మబద్ధంగా నడిపేందుకు తమ ప్యానెల్‌ను పూర్తి మెజారిటీతో గెలిపించాలని కోరారు.