Reading Time: < 1 minute

కిలో ఉల్లి 35 రూపాయలు మాత్రమే : ఈ రెండు రాష్ట్రాల్లో బంపరాఫర్

Caption of Image.

ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తాయో రావో కానీ.. కొనే ముందైతే కన్నీళ్లు వచ్చే పరిస్థితి. దేశ వ్యాప్తంగా ఉల్లి రేట్లు పెరగటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 20, 30 రూపాయలు ఉన్న ఉల్లి 60, 70 రూపాయలకు చేరుకోవడంతో ఉల్లి సరఫరా పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నా అది ఎక్కడా సరిపోవడం లేదు. దీంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. 

ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు ఉల్లి అందించేందుకు నిర్ణయం తీసుకుంది . రేషన్ షాపులలో కిలో 35 రూపాయలకు ప్రజలకు ఉల్లిగడ్డల పంపిణీ చేయనున్నట్లు విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.  సగం ధరకే ఉల్లిగడ్డలు పంపిణీ చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఉల్లిగడ్డల ధర కేజీ 55 నుంచి 60 రూపాయలకు చేరుకుంది. సీఎం విజయ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 8 వేల 914 రేషన్ షాపులలో సెప్టెంబర్ 4 నుంచి పంపిణీ చేయనున్నారు. 

రాష్ట్రంలో గత వంద రోజులలో పెరుగుతున్న ధరలను కట్టడి చేయడంలో విజయ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ఫుడ్, సివిల్ సప్లై మినిస్టర్ వెంకటరామన్ ఉల్లిగడ్డలను తక్కువ ధరలకు ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలు సేకరించి ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. 

ఢిల్లీలో కూడా..

మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల సరఫరాచేస్తోంది. దేశరాజధానిలో ఉల్లిపాయల ధరలు భారీగా పెరగటంతో.. కేంద్ర ప్రభుత్వం 1000 మెట్రిక్ టన్నులు కేటాయించింది. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా కేజీ ఉల్లిని 35 రూపాయలకు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. 

ఢిల్లీలోని మొత్తం 13 జిల్లాలో ప్రత్యేక మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశారు. వ్యాన్ల ద్వారా కూడా  సబ్సిడీ ఉల్లిని పంపిణీ చేయనున్నారు. దీంతో సామాన్యులకు భారీ ఊరట కలగనుంది. 

©️ VIL Media Pvt Ltd.