
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమి దేశాలు, భాగస్వామ్య దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయ ప్రముఖులతో కూడిన ‘బ్రిక్స్ చీఫ్ జస్టిసెస్ ఫోరం’ సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. భారత సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈ నెల 6 వరకు కొనసాగనుంది. ఈ సదస్సులో భాగంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివిధ దేశాల న్యాయ అధిపతులతో వరుసగా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. న్యాయ పంపిణీ వ్యవస్థ, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, న్యాయవ్యవస్థలో సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై సభ్యదేశాలు పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సులో ప్రధానంగా మధ్యవర్తిత్వం అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం, సరిహద్దులు దాటి ఆర్బిట్రల్ అవార్డుల అమలు, న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగం, న్యాయ నాయకత్వం సుస్థిర అభివృద్ధిపై చర్చ జరగనుంది.