Reading Time: 2 minutes
Ramba Oorvasi Menaka Review : రంభ ఊర్వశి మేనక రివ్యూ.. ఫాంటసీ కథతో అల్లరి నరేష్ చేసిన మ్యాజిక్ ఏంటి..?

మూవీ రివ్యూ: రంభ ఊర్వశి మేనక

నటీనటులు: అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే తదితరులు..

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

సంగీతం: చైతన్ భరద్వాజ్

ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ

నిర్మాతలు: రాజేశ్ దండా, నిమ్మకాల ప్రసాద్.

ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక. దానికితోడు దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో ఈ సినిమాను చంద్రమోహన్ తెరకెక్కించారు.. మరి ఇది ఎలా ఉంది.. ఆడియన్స్ మనసులు దోచుకుందా లేదా అనేది చూద్దాం..

కథ:

మంతెన సూర్య నారాయణ (అల్లరి నరేష్)కు లైఫ్ అంటే పెద్దగా సీరియస్ నెస్ ఉండదు.. చిన్నప్పటి నుంచి తమ పెద్దలు చెప్పిన ఓ మ్యాజిక్ బుక్ చుట్టూనే తిరుగుతుంటాడు. జీవితంపై బాధ్యత లేకుండా ఎప్పుడూ ఆ మాయల పుస్తకం తెరిచి రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదికి రప్పించాలని చూస్తుంటాడు. వాళ్లు వస్తే తన కోరికలన్నీ తీరిపోయి పెద్ద హీరో అయిపోవచ్చని వాళ్ల బాబాయ్ CEO (నరేష్ వీకే) చెప్తాడు. దాంతో 25 ఏళ్లుగా ముగ్గు వేసి రంభ (రాశి సింగ్), ఊర్వశి (విష్ణుప్రియ), మేనక (ప్రిషా సింగ్) కోసమే వేచి చూస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూరి ముగ్గు ప్రయత్నం ఫలించి ఆ ముగ్గురు దేవకన్యలు భూమిపైకి వస్తారు. తన అనుమతి లేకుండా భూమ్మీదకు వచ్చిన దేవకన్యలకు శక్తులు లేకుండా శపిస్తాడు ఇంద్రుడు (వెన్నెల కిషోర్). పవర్స్ లేని వాళ్లతో సూరి ఏం చేసాడు.. అనూహ్యంగా అతని తల్లి అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవడంతో ఏం చేస్తాడు..? ఆ తర్వాత సూర్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ వింత పరిస్థితుల నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అన్నదే ఈ చిత్ర ప్రధానాంశం.

కథనం:

మామూలుగా అల్లరి నరేష్ ఫాంటసీ సినిమా అంటే అంచనాలు బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన గతంలో చేసిన కొన్ని కామెడీలు వర్కవుట్ అయ్యాయి కూడా. దాంతో చాలా రోజుల తర్వాత ఈయన నుంచి ఒక ఫాంటసీ సినిమా వస్తుందంటే ఆడియన్స్ అంచనాలు బాగానే పెట్టుకున్నారు. కానీ ఈ పాయింట్‌ను తీసుకుని వినోదాన్ని పంచాలని దర్శకుడు చేసిన ప్రయత్నం తెరపై మాత్రం బెడిసికొట్టింది. ఎక్కడా ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాతో సాగడం వల్ల తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేయవచ్చు. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో సరైన సంఘర్షణ, ఆసక్తికరమైన ట్విస్టులు ఉంటేనే జనం కూర్చుంటారు. కానీ ఇందులో అవేవీ కనిపించవు. పోనీ కామెడీ అయినా పండిందా అంటే అదీ లేదు. బలవంతంగా నవ్వించడానికి చేసిన ప్రయోగాలు, అవుట్ డేటెడ్ స్పూఫ్‌లు ఇప్పటి జనరేషన్‌కు ఏమాత్రం రుచించవు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కొన్ని నవ్వులు పూసినా, ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమా పూర్తిగా ట్రాక్ తప్పింది. భావోద్వేగాలు, వినోదం కలగలుపుదామనుకున్న ఆలోచన పల్చగా మారిపోయి సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో లాజిక్ లేని సన్నివేశాలు కథనాన్ని మరింత నీరుగార్చాయి. నేచురల్ కామెడీని ఆశిస్తున్న ఈ రోజుల్లో పాత చింతకాయ హాస్యాన్ని నమ్ముకోవడమే ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌గా మారింది. క్లైమాక్స్ కూడా హడావిడిగానే లాజిక్స్ లేకుండా ముగించేసారు. నరేష్ నుంచి ఇలాంటి కామెడీ సినిమాల కంటే సీరియస్ సినిమాలే బెటర్ అనుకోవచ్చేమో..?

నటీనటులు:

చాలా గ్యాప్ తర్వాత తన మార్క్ పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో అల్లరి నరేష్ చక్కగా నటించాడు. కానీ ఏం చేస్తాం కథ సహకరించకపోతే నరేష్ ఎంత బాగా చేసినా ప్రయోజనం అయితే ఉండదు. సీఈఓగా చేసిన సీనియర్ నరేష్ తనదైన కామిక్ టైమింగ్‌తో బాగా ఎంటర్‌టైన్ చేశాడు. ముఖ్యంగా ఆయన రంభను లైన్లో పెట్టేందుకు చేసే ప్రయత్నాలు, డైలాగ్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. దేవకన్యలుగా చేసిన రాశీ సింగ్, ప్రిషా సింగ్, విష్ణు ప్రియ కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా చాలా హుందాగా, అందంగా కనిపించారు. ఇంద్రుడి గెటప్‌లో వెన్నెల కిషోర్, హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి తమ కామెడీతో కాస్త రిలీఫ్ ఇచ్చారు. ఇకపోతే సురభి పాత్రకైతే కథలో ఎలాంటి ప్రాధాన్యత లేదు, తారక్ పొన్నప్ప క్యారెక్టర్ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

టెక్నికల్ టీం:

చైతన్ భరద్వాజ్ సంగీతం పర్లేదు.. ఆర్ఆర్ కూడా ఓకే. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది.. ఎఫెక్ట్స్ బాగానే అనిపిస్తాయి. ఎడిటర్ చోటా కె ప్రసాద్ సెకండ్ హాఫ్‌లో చాలా బోర్ కొట్టించే సీన్లను ట్రిమ్ చేయాల్సింది. కానీ డైరెక్టర్ ఛాయిస్ కాబట్టి అతన్ని తప్పుబట్టలేం. దర్శకుడు చంద్రమోహన్ రాసుకున్న కాన్సెప్ట్‌కు బలమైన స్క్రిప్ట్ తోడై ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. కానీ సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడంతో సినిమా నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా రంభ ఊర్వశి మేనక.. ఆకట్టుకోని ఫాంటసీ డ్రామా..!