
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య పుట్టినరోజు నాడే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… కొత్తగూడెం పట్టణానికి చెందిన 40 ఏళ్ళ రమేష్ తన భార్య రాధికతో కలిసి వివేకానంద నగర్ లో నివసిస్తున్నాడు. అయితే.. భార్య పుట్టినరోజు సందర్భంగా బంధువులతో ట్యాంక్ బండ్ కు వెళ్లాలని కోరగా… తాను రాలేనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు రమేష్.
రాధిక తన అక్క, తమ్ముడితో కలిసి ట్యాంక్ బండ్ కు వెళ్లగా… రమేష్ సారీ.. గుడ్ బై అంటూ రాధికకు మెసేజ్ పంపాడు. ఈ క్రమంలో మెసేజ్ చూసి ఆందోళనకు గురైన రాధిక హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా.. రమేష్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.
►ALSO READ | ఇన్‌స్టాలో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో రూ. 5. 30 కోట్లు టోకరా
రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే రమేష్ ఆత్మహత్యకు కారణమా లేక ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలు లాంటి వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రమేష్ మృతితో అతని భార్య కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.