
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు సందర్భంగా గుర్తించిన భారీ ఆస్తులపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించింది. భీమ్‌రెడ్డికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి తీసుకువచ్చినట్లు సమాచారం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్‌రెడ్డిని ఏసీబీ జూలై 6న అరెస్ట్ చేసింది. ఏసీబీ దర్యాప్తులో భాగంగా భీమ్‌రెడ్డికి సంబంధించి సుమారు రూ.150 కోట్లకుపైగా విలువైన ఆస్తులను గుర్తించారు. ఈ ఆస్తుల వివరాలను పరిశీలించిన అనంతరం అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును ఆస్తుల కొనుగోలుకు వినియోగించారా.? అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పటాన్‌చెరు, నాగోలు, మోమిన్‌పేట్, జహీరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ భీమ్‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఏసీబీ గుర్తించింది. మొత్తంగా దాదాపు 20 ఆస్తులను గుర్తించగా, వాటిలో ఎక్కువ ఆస్తులు ఇతరుల పేర్లపై ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో ఆస్తుల అసలు యజమానులు ఎవరు? వాటి కొనుగోలుకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? భీమ్‌రెడ్డికి సంబంధించిన వ్యక్తులు లేదా బినామీల పేర్లపై ఆస్తులు ఎందుకు కొనుగోలు చేశారు? అనే అంశాలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టింది. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును వివిధ మార్గాల్లో మళ్లించి ఆస్తులుగా మార్చారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఆదాయపు పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్ కూడా భీమ్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తుల్లో వెలుగులోకి వస్తున్న ఆస్తులు, లావాదేవీల వివరాలు కీలకంగా మారాయి.
దర్యాప్తు పూర్తయిన తర్వాత భీమ్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన నిధుల మూలాలు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల యాజమాన్య వివరాలు, బినామీల పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆస్తులు అక్రమంగా సంపాదించినవేనని లేదా మనీలాండరింగ్ జరిగినట్లు తుది నిర్ధారణగా చెప్పలేం. ఈడీ దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉండనున్నాయి.