
West Bengal: పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ మంత్రి శరదావత్ ముఖర్జీ రాష్ట్రంలోని విద్యార్థినులకు కీలక సూచన చేశారు. సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో స్కర్టులు ధరించొద్దని చెప్పారు. దీనికి బదులుగా పూర్తిగా కాళ్లను కప్పే సల్వార్లు ధరించాలని కోరారు. బాలురు కూడా ఫుల్ ప్యాంట్లు, ఫుల్ షర్టులు ధరించి స్కూళ్లకు రావాలని సూచించారు. “అమ్మాయిలను స్కర్టులు వేసి పాఠశాలకు పంపవద్దు. కాళ్లను కప్పి ఉంచే సల్వార్లు ధరించనివ్వండి. మోకాళ్ల వరకు ఉండే సాక్సులు వేసుకోవద్దు. అవి కాళ్లకు అంటుకుపోతాయి. సాక్సులు చాలా పలుచగా ఉంటాయి. అమ్మాయిలు సల్వార్లు ధరించాలి. అబ్బాయిలు ఫుల్ ప్యాంట్లు, ఫుల్ షర్టులు ధరించాలి” అని కోరారు.
మూడు నెలల్లో డెంగ్యూ వ్యాప్తిని అడ్డుకోవడానికి, దోమకాటుకు విద్యార్థులు గురికాకుండా మంత్రి ఈ సూచనలు చేశారు. అయితే, మంత్రి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దోమకాటును నివారించేందుకు శరీరాన్ని కప్పి ఉంచే దస్తులు ధరించాలని చెప్పడం మంచిదే అని, అయితే కేవలం దుస్తులు మార్చుకోవడం వల్ల మాత్రమే డెంగ్యూను పూర్తిగా నివారించలేమని అసోసియేషన్ ఆఫ్ హెల్త్ సర్వీస్ డాక్టర్స్ కార్యదర్శి డాక్టర్ ఉత్పాళ్ బెనర్జీ అన్నారు. దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలను నిర్మూలించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ముఖ్యమని చెప్పారు.
మంత్రి సూచనల్ని మరికొందరు వైద్యులు సమర్థిస్తున్నారు. పూర్తి చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించడం వల్ల దోమకాటు ప్రమాదం తగ్గుతుందని ఆయన చెప్పారు. దోమలు కుట్టే అవకాశం తగ్గితే డెంగ్యూ సంక్రమణ ప్రమాదం కూడా తగ్గుతుందని వివరించారు. మంత్రి కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇలాంటి సూచనలు చేయలేదని, అబ్బాయిలు కూడా పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించాలని కోరారని అంటున్నారు. వర్షాకాలంలో పశ్చిమ బెంగాల్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. 2026లో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన 7,600కు పైగా కేసులతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 50 శాతం తక్కువగా ఉంది.