Reading Time: < 1 minute

ఇష్టపూర్వక శారీరక సంబంధాన్ని..అత్యాచారంగా పరిగణించలేం..కర్నాటక హైకోర్టు కీలక తీర్పు 

Caption of Image.

బెంగళూరు: కర్నాటక హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ప్రేమ సంబంధం ముగిసిన తర్వాత లేదా పెండ్లికి నిరాకరించినంత మాత్రానా మొదట్లో ఇష్టపూర్వకంగా జరిగిన శారీరక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఒక యువకుడు, యువతి మధ్య ఇష్టపూర్వకంగా సాగిన సంబంధం (కాన్సెన్సువల్ సెక్స్).. బ్రేకప్ తర్వాత క్రైమ్​గా మారదని, దానిని క్రిమినల్ నేరంగా మార్చలేమని తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచార కేసును కోర్టు కొట్టివేసింది. కాలేజీ రోజుల్లో ఇష్టపడి దాదాపు రెండేండ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్న యువతి, యువకుడి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. అయితే, బాధితురాలు రాజీ పడటానికి ముందుకొచ్చినప్పటికీ, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో కేవలం ఇరువర్గాలు రాజీపడ్డారనే కారణంతో మాత్రమే కేసును కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

అందువల్ల కేసులోని మెరిట్స్ ఆధారంగా సమగ్రంగా పరిశీలించింది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఇష్టపూర్వక సంబంధం పెండ్లి వరకు వెళ్లకపోతే దానిని అత్యాచారం అనలేమని హైకోర్టు పేర్కొంది. యువకుడు మొదట్నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు హామీ ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పంది. కానీ, వాటికి బలమైన ఆధారాలు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.