
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు సమీపించింది. తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఈ పరీక్షకు సెప్టెంబరు 5, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఫీజు చెల్లించాలి. ఫీజును ఎస్‌బీఐ చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు నాలుగేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందుతుంది. అంటే ఏడాదికి రూ.12 వేలు, నాలుగేళ్లలో మొత్తం రూ.48 వేలు లభిస్తుంది.
ప్రస్తుతం 2026-27 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్ లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతి రెగ్యులర్‌గా చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-26 విద్యాసంవత్సరంలో 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. అయితే గురుకుల పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కారు. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుల (HM) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు అనంతరం అప్లికేషన్ ప్రింట్‌అవుట్‌ను నిర్ణీత గడువులో సంబంధిత DEO కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..
విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT)లో 90 మార్కులకు 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT)లో 90 మార్కులకు 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు చొప్పున అడుగుతారు. 7, 8 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు పేపర్లలోనూ నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2026.
- DEO కార్యాలయంలో అప్లికేషన్ ప్రింట్‌అవుట్ సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2026.
- రాత పరీక్ష తేదీ: నవంబర్ 1, 2026 (ఆదివారం).
- పరీక్ష సమయం: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
తెలంగాణ NMMS స్కాలర్‌షిప్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.