
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మూడు విజయవంతమైన సీజన్లతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘మీర్జాపూర్’. పగ, ప్రతీకారం, అధికార దాహం నేపథ్యంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ను ఇప్పుడు ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెర పైకి తీసుకువచ్చారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. సిరీస్‌కు కొనసాగింపు కాకుండా, మొదటి సీజన్ సమయంలో జరిగే సమాంతర కథగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నిన్ననే థియేటర్లలోకి వచ్చింది. అసలు సిరీస్ చూడని వారికి కూడా అర్ధమయ్యేలా ఉంటుందని టీం చెప్పిన దానిలో నిజమెంత? ఓటీటీలో అదరగొట్టిన మీర్జాపూర్ గ్యాంగ్ బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ రివ్యూలో చూద్దాం.
మీర్జాపూర్ ది మూవీ కథ:
మీర్జాపూర్ సింహాసనాన్ని ఎవరు అధిష్టిస్తే వారు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసించగలరనేది సిరీస్ చూసిన అందరికీ తెలుసు. ప్రస్తుతం ఆ పీఠంపై అప్రకటిత చక్రవర్తిగా అఖండానంద్ త్రిపాఠి అలియాస్ కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కొనసాగుతుంటాడు. అయితే తన కొడుకు మున్నా భయ్యా (దివ్యేందు) ప్రవర్తన, దూకుడు పట్ల నమ్మకం లేని కాలీన్ భయ్యా.. తన సామ్రాజ్య బాధ్యతలను గుడ్డు పండిట్ (అలీ ఫజల్), బబ్లూ పండిట్ (జితేంద్ర కుమార్)లకు అప్పగిస్తాడు. దీంతో మున్నా భయ్యా, పండిట్ బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. సరిగ్గా ఇదే సమయంలో జైసల్మేర్‌కు చెందిన శక్తివంతమైన వ్యాపారవేత్త బబన్ యాదవ్ (రవి కిషన్), మీర్జాపూర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రతో రంగంలోకి దిగుతాడు. బబన్ యాదవ్ వేసిన వ్యూహం ఏంటి? కాలీన్ భయ్యాకు, అతడికి మధ్య జరిగిన డీల్ ఏంటి? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే గుడ్డు-మున్నా ఒకటవ్వడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? చివరకు మీర్జాపూర్ సింహాసనం ఎవరికి దక్కింది? అనేది ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
ఓటీటీలో సూపర్ క్రేజ్ ఉన్న వెబ్ సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌కు అనుగుణంగా మలచడం ఓ సాహసమే అని చెప్పాలి. సిరీస్ అసలు థీమ్‌ను చెడగొట్టకుండా, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌కు అవసరమైన మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి మేకర్స్ ఈ ప్రయోగంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. పవర్ గేమ్, ఇంటెన్స్ యాక్షన్, సిరీస్‌కు ట్రేడ్ మార్క్‌గా నిలిచిన డైలాగ్స్ అండ్ హ్యూమర్ బిగ్ స్క్రీన్‌పై కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా మీర్జాపూర్, జైసల్మేర్ ప్రాంతాల మధ్య ఉన్న కనెక్షన్లను దర్శకుడు చక్కగా ఎలివేట్ చేశారు.
అయితే, దాదాపు మూడు గంటలకు పైగా ఉన్న సినిమా నిడివి ప్రేక్షకులకు కాస్త పరీక్ష పెడుతుంది. ఫస్టాఫ్‌లో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. అప్పటికే సిరీస్ ద్వారా పరిచయమైన పాత్రలను మళ్లీ ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం, గుడ్డు-బబ్లూ లవ్ స్టోరీస్, అనవసరమైన పాటలు కథా గమనానికి అడ్డుకట్ట అనిపిస్తాయి. అయితే ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. జైసల్మేర్‌లో ఎపిసోడ్స్, కార్ చేజింగ్ సీక్వెన్స్, గుడ్డు-మున్నా ఫేస్-ఆఫ్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.
సినిమాకు అసలైన బలం చివరి గంటలోనే ఉంది. కాలీన్ భయ్యా కిడ్నాప్, బబ్లూ తన తెలివితేటలతో ఆ స్థావరాన్ని కనిపెట్టడం, ఆ తర్వాత వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఎంగేజింగ్ అనిపిస్తాయి. ఒక లాంగ్-ఫార్మాట్ స్టోరీటెల్లింగ్‌ను సినిమాకు కుదించే క్రమంలో దర్శకుడు కాస్త తడబడినప్పటికీ, యాక్షన్ తో పాటు కుటుంబ భావోద్వేగాలను, బ్రదర్స్ మధ్య ఉన్న ఈగో, జెలసీ, బాండింగ్‌ను బ్యాలెన్స్ చేయడంలో సఫలమయ్యారు. పోస్ట్-క్రెడిట్ సీన్స్ భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచుతాయి.
నటీనటుల విషయానికి వస్తే కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి ఎప్పటిలాగే తనదైన సెటిల్డ్ అండ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. కేవలం చూపులు, చిన్నపాటి హావభావాలతోనే ఆయన భయాన్ని పుట్టించగలరు. గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్ కండలు తిరిగిన శరీరంతో, యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టాడు. బబ్లూ పండిట్ పాత్రలో విక్రాంత్ మాస్సే స్థానంలో వచ్చిన జితేంద్ర కుమార్ చక్కగా ఒదిగిపోయాడు, గుడ్డుకు బ్రెయిన్‌లా వ్యవహరించే బబ్లూ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక అందరి ఫేవరెట్ మున్నా భయ్యాగా దివ్యేందు శర్మ మరోసారి అదరగొట్టాడు. అతడి ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ విలన్‌గా సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. క్రూరంగా కనిపిస్తూనే, మరోవైపు రొమాంటిక్ యాంగిల్ ఉన్న విలన్‌గా ఆయన నటన అద్భుతం. సోనాల్ చౌహాన్ గ్లామర్ అద్దగా, బీనా పాత్రలో రసిక దుగల్‌కు ఈసారి మరింత ప్రాధాన్యత దక్కింది, ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అయితే శ్రియ పిల్గావ్కర్, శ్వేతా త్రిపాఠి లాంటి పాత్రలకు సినిమాలో పెద్దగా స్కోప్ లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే సాంకేతికంగా ఈ సినిమా ఫస్ట్ క్లాస్‌లో ఉంది. సంజయ్ కపూర్ సినిమాటోగ్రఫీ స్టన్నింగ్‌గా ఉంది, ముఖ్యంగా రాజస్థాన్ ఎడారి విజువల్స్ సినిమాకు రిచ్ లుక్‌ను, ఒక సినిమాటిక్ ఫీల్‌ను తీసుకువచ్చాయి. జాన్ స్టీవర్ట్ ఎడూరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది, రాప్ ట్రాక్స్ సినిమా స్వాగ్‌ను పెంచాయి. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా స్టైలిష్‌గా, బ్రూటల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్. అయితే మనన్ అశ్విన్ మెహతా ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. మూడు గంటల నిడివిని తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది. దర్శకుడు గుర్మీత్ సింగ్ బిగ్ స్క్రీన్‌పై మీర్జాపూర్ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ అయినా, స్క్రీన్‌ప్లేను మరింత బిగుతుగా రాసుకోవాల్సింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
ఫైనల్లీ: ‘మీర్జాపూర్ నిడివి ఒక్కటి ఓర్చుకుంటే థియేటర్లో మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఎక్స్ పీరియన్స్ గ్యారెంటీ!