Reading Time: < 1 minute
Eagle Force Busts Illegal Vape Racket Madhapur Hyderabad

హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాలపై ‘ఈగల్ ఫోర్స్’ విరుచుకుపడింది. రెండు వేర్వేరు ఔట్‌లెట్లపై ఏకకాలంలో జాయింట్ రైడ్స్ నిర్వహించిన అధికారులు, అక్రమ దందాను ఛేదించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ఇద్దరు యజమానుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లు, 34 ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు, 3 స్కానర్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఒక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వేప్స్ విక్రయిస్తూ ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కస్టమర్ల నుంచి నేరుగా వాట్సాప్‌లో ఆర్డర్లు స్వీకరించి, QR కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్లు పొందేవారు. ఆ తర్వాత ఆర్డర్ చేసిన వేప్స్‌ను పోర్టర్, రాపిడో వంటి డెలివరీ యాప్స్ ద్వారా కస్టమర్ల ఇళ్లకు పంపేవారు. ఈ క్రమంలో నిందితులకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను పరిశీలించగా.. అందులో రూ.2.31 కోట్లకు పైగా భారీ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఈ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, హైదరాబాద్‌లోనే దాదాపు 130 మంది వేప్ వినియోగదారులను గుర్తించారు. అంతేకాకుండా.. బ్యాంకింగ్ లావాదేవీలను విశ్లేషించడం ద్వారా మొత్తం 351 మంది కొనుగోలుదారుల వివరాలను రాబట్టారు. కేవలం విక్రయదారులే కాకుండా.. వేప్స్ కొనుగోలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. వేప్స్ అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన పూర్తి సప్లై చైన్‌ను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది.