Reading Time: < 1 minute

ఎథిక్స్ కమిటీ నోటీసుకు వివరణ ఇవ్వని కౌశిక్..పది రోజుల గడువు ముగిసినా రాని రిప్లై

Caption of Image.
  • శనివారం వివరణ ఇస్తామంటున్న బీఆర్‌ఎస్ వర్గాలు 

హైదరాబాద్, వెలుగు: గత అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిపై అనుచితంగా వ్యవహరించారనే ఫిర్యాదుపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నోటీసుకు శుక్రవారం వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వివరణ ఇవ్వలేదు. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని గత నెల 25న కమిటీ నోటీసులు జారీ చేసింది. గడువు ముగియడంతో కౌశిక్‌పై తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై కమిటీ దృష్టి పెట్టింది.

మరోసారి నోటీసు ఇవ్వాలా? లేక కౌశిక్‌రెడ్డిని నేరుగా కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించాలా? అనే దానిపై కమిటీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే శనివారం తన వివరణను కమిటీకి పంపనున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కౌశిక్ ఇచ్చే వివరణతో కమిటీ సంతృప్తి చెందుతుందా? లేక వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో కౌశిక్‌రెడ్డి అంశం ఆసక్తికరంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.