Reading Time: < 1 minute
Konda Surekha Removal Congress High Command Set To Act

Konda Surekha Facing Cabinet Exit: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మంగళ, బుధ వారాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అధిష్ఠానంతో నిర్వహించిన చర్చల అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే కొండా సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన లేఖను లోక్‌భవన్‌కు పంపించే అవకాశం ఉందని సమాచారం. బర్తరఫ్‌ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపై కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలకు సంబంధించి సీఎం రేవంత్‌, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సహా పలువురు సీనియర్‌ నేతల నుంచి అధిష్ఠానం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి సురేఖ విషయంలో తుది నిర్ణయం తీసుకుంది.

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఏర్పడే రాజకీయ సమీకరణాలను కూడా కాంగ్రెస్‌ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు కేటాయించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని బీసీ మహిళా నేతకు ఇవ్వడంతో పాటు.. మరో రెండు కీలక పదవులను కూడా బీసీ మహిళా నేతలకు కేటాయించే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేర్లను పార్టీ సీనియర్‌ నేతల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ సేకరిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. సీఎం రేవంత్‌ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత కొండా సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.