Reading Time: 3 minutes

ఎమ్మెల్యేగా కొనసాగుతా.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా: కొండా సురేఖ

Caption of Image.
  • ఏ తప్పు చేయకపోయినా బర్తరఫ్ చేసిన్రు
  • నన్ను తొలగించే ఆలోచన హైకమాండ్​కు లేదు
  • నా వల్ల ముగ్గురు బీసీ బిడ్డలకు పదవులివ్వడం సంతోషం
  • మీడియాతో మాజీ మంత్రి కొండా సురేఖ

ఏ తప్పు చేయకపోయినా తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని  కొండా సురేఖ అన్నారు. తనను పదవి నుంచి తొలగించాలనే ఆలోచన హైకమాండ్​కు లేదని, సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు భయపడే తప్పించారని ఆరోపించారు. మంత్రి పదవి పోయిందనే బాధ లేదని, తాను చేసిన తప్పేంటో చెప్పకుండా తప్పించారనే బాధ  ఉందని ఆమె వాపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని సురేఖ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గం నుంచి బర్తరఫ్​చేసినట్టు మీడియా ద్వారా తెలుసుకున్న కొండా సురేఖ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

రాజీనామా చేయాలని తనను ఒక్కమాట అడక్కుండానే బర్తరఫ్ చేయడం బాధాకారమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ‘ఏ తప్పు చేయకపోయినా నన్ను బర్తరఫ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గానీ, కాంగ్రెస్ పార్టీని గానీ నేను ఒక్క మాట అనకున్నా నన్ను తొలగించడం బాధాకరం. నన్ను ఎవరు తొలగించారో.. ఎందుకు తొలగించారో స్పష్టత లేదు. నాకు మంత్రి పదవి పోయిందనే బాధ ఏమాత్రం లేదు.. కానీ, మాటమాత్రమైనా చెప్పకుండా తప్పించారనే బాధ ఉంది. ఉరివేసే ఖైదీని సైతం చివరి కోరిక అడుగుతారు. అలాంటిది నన్ను బర్తరఫ్ చేసేముందు ఏమీ అడగలేదు. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా నా రాజీనామా గురించి ఎవరు చర్చించలేదు’ అని సురేఖ అన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఎంతోమంది పార్టీకి, ముఖ్య నేతలకు, హైకమాండ్​కు వ్యతిరేకంగా మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, డబ్బులిచ్చి పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నారని ఆరోపించినోళ్లకు సన్మానాలు చేశారని అన్నారు. ‘నా బర్తరఫ్ వెనుక రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం సోదరులు కొండల్‌‌ రెడ్డి, తిరుపతి రెడ్డి కుట్ర ఉంది’ అని సురేఖ ఆరోపించారు. తాను బీసీ మహిళనని, తనను తప్పించడం కాంగ్రెస్ పార్టీకే నష్టమని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. 

‘కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ పథకాల అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై సర్వే చేయిస్తే ఈ విషయాలు తెలుస్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనపై సంతోషంగా ఉన్నారా? మీరు గుండెలపై చేయి వేసుకొని చెప్పండి. మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకు  జరుగుతుంది. ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి’ అని సురేఖ సూచించారు.  సుస్మిత వ్యాఖ్యలను తాను ఖండిస్తే ఆమె ప్రాధాన్యత తగ్గుతుందన్నారు. తన వల్ల ముగ్గురు బీసీ బిడ్డలకు పదవులు రావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.  

కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వలే.. 

తమ తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిడ్డను ఎంపీని చేశారని.. కానీ, ఇచ్చిన మాట ప్రకారం కొండ మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని సురేఖ అన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ ను ఎన్నోసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చారని విమర్శించారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ జిల్లా పార్టీ బాధ్యతలను కొండా మురళికి ఇస్తామని సీఎం ప్రకటించారు. 11 సీట్లను గెలిపించాం. నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నా కూతురు వ్యాఖ్యలపై నన్ను బద్నాం చేయడం సరైంది కాదు. ఆమె స్వతంత్రంగా తన అభిప్రాయాలు చెప్తే.. నన్ను ఎందుకు బాధ్యురాలిని చేస్తారు? డి. శ్రీనివాస్ కాంగ్రెస్ లో ఉంటే ఆయన కొడుకు బీజేపీలో లేరా? ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉంటారు. నా కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేశారు?’ అని సురేఖ ప్రశ్నించారు. తనపై, తన ఓఎస్డీపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్​చేశారు. ‘మా ప్రభుత్వంలో మా మనుషులపై కేసులు పెట్టడం ఇదే మొదటిసారి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో రేవంత్ రెడ్డికి సంబంధాలు లేవు’ అని సురేఖ పేర్కొన్నారు.

నా శాఖపై సీఎంవో జోక్యం ఎక్కువైంది: కొండా సురేఖ
బీసీ మహిళా మంత్రిగా ఉన్న తనపై రాజకీయ అణచివేత కొనసాగిందని, తన శాఖపై సీఎంఓ జోక్యం ఎక్కువైందని సురేఖ ఆరోపించారు. బర్తరఫ్ అనంతరం తనను సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేతలకు చేసిన ఫిర్యాదును ఆమె మీడియా కు విడుదల చేశారు. సోనియా గాంధీ, రాహు ల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే,  కేసీ వేణు గోపాల్, మీనాక్షి నటరాజన్ కు మెయిల్ ద్వారా పంపిన లేఖల్లో ఆమె పలు విషయాలను పేర్కొన్నారు. బీసీ మహిళా మంత్రిగా ఉన్న తనపై రాజకీయ అణచివేత కొనసాగుతున్నదని, తన శాఖపై సీఎంఓ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. ‘నా శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు నా ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. నా మంత్రి పాత్రను నా మమాత్రంగా మార్చుతు న్నారు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.  యాదాద్రి ట్రస్టు బోర్డు నియా మకంపై కనీసం తనకు సమాచారం లేద ని, తనకు కనీస సమాచారం లేకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.