Reading Time: < 1 minute

బాల కార్మికులపై ఎన్‌సీపీసీఆర్ స్పెషల్ డ్రైవ్ 

Caption of Image.
  • దేశవ్యాప్తంగా 3,800 మందికి పైగా బాలల విముక్తి

న్యూఢిల్లీ: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక రక్షణ, పునరావాస కార్యక్రమంలో 3,800 మందికి పైగా బాలలను రక్షించినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా కలెక్టర్లు, కార్మిక శాఖలు, పోలీసు విభాగాల సమన్వయంతో ఈ డ్రైవ్ చేపట్టామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది.

ఈ తనిఖీల్లో బాల కార్మికులు, అక్రమ రవాణా, దోపిడీకి గురవుతున్న చిన్నారులను గుర్తించి రక్షించామని, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 575కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించింది. రక్షించిన చిన్నారులకు పునరావాసం కల్పించడం, కుటుంబాలకు అప్పగించడం, తిరిగి బడుల్లో చేర్పించడం వంటి చర్యలపై రాష్ట్రాల నుంచి ఎన్‌సీపీసీఆర్ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోందని స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.