
అనుబంధం ఆత్మీయత అంతా బూటకం.. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.. వింత నాటకం.. తరతరాల కిందనే ఈ నగ్న సత్యం పాట రూపంలో వచ్చింది. ఆస్తులు, అంతస్తులు ఉంటేనే ఎవరైనా.. ఆస్తుల కోసం తల్లిదండ్రులనే కాదు తోడబుట్టినోళ్లను చంపుకుతింటున్నారు నేటి సమాజంలో.. మహారాష్ట్ర రాష్ట్రం పూణెలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తమకు తెలియకుండా భూమిని అమ్మారని తల్లిదండ్రులను నడి రోడ్డుపై కర్రలతో కొట్టారు కడుపున పుట్టిన కొడుకులు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆగస్టు 30వ తేదీన మహారాష్ట్రలోని ఇందాపూర్‌లో వెలుగు చూసింది ఈ అమానవీయ ఘటన. వృద్ధ దంపతులు వాకింగ్ వెళ్లిన సందర్భంగా సడెన్ గా కారులో వచ్చిన వారి కుమారులు సంజయ్ రౌత్, రాజేంద్ర రౌత్ అనే ఇద్దరూ విచక్షణా రహితంగా కర్రలతో కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తల్లి అంజనా పేరుపై ఉన్న భూమిని తండ్రి తుకారాం(65) ఇటీవల అమ్మేసినట్లు వారి కుమారులకు తెలిసింది. దీంతో కోపాద్రిక్తులై.. తమకు ఇవ్వకుండా భూమి ఎలా అమ్ముతారని తల్లిదండ్రులపై దాడి చేశారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులం, దయచేసి కొట్టొద్దు అని వేడుకున్నా కనికరించకుండా విచక్షణారహితంగా దాడి చేశారు.
మాకు చెప్పకుండా భూమి ఎందుకు అమ్మారు..? అంటూ కర్రలతో కొట్టడంతో.. తుకారం మొహం, వీపు, తొడలు, ఎడమ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు తల్లి అంజన నడుము, మణికట్టు పట్టేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
దాడి సందర్భంగా.. భూమిని వెనక్కు తీసుకోవాలని.. లేదంటే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వయసు మళ్లిన తల్లిదండ్రులను దారుణంగా కొట్టడం చూసిన ఇరుగుపొరుగు వారు.. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా మీ కేం సంబంధం అంటూ బెదిరించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పట్టించుకోని కొడుకులు:
తన ఇద్దరు కొడుకులు ఇంజాపూర్ మల్వాడిలోని 2వ నెంబర్ లో కుటుంబాలతో ఉంటున్నారని తుకారం పోలీసులకు చెప్పారు. గ్రామంలో చేతకాని పరిస్థితుల్లో వృద్ధ దంపతులం ఉంటున్నట్లు చెప్పారు. ఈ వయసులో తమకు కొడుకుల నుంచి ఎలాంటి సాయం లేదని.. అనారోగ్యం వచ్చినా, చేతకాకపోయినా పట్టించుకునే పరిస్థితి లేదని పోలీసులకు తెలిపారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. కుమారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
महाराष्ट्र में पुणे के इंदापुर में जमीन विवाद में बेटों ने बीच सड़क में पिता को लाठियों से पीटा। इस दौरान पिता दर्द से कराहता रहा, लेकिन बेटों को दया नहीं आई। बेटे बेरहमी से पिता को पीटते रहे। मीडिया रिपोर्ट्स के मुताबिक मामला इंदापुर शहर में सलीम लॉन्स के पास का है। pic.twitter.com/c67qSR4kbQ
— The Federal Desh (@thefederal_desh) September 2, 2026