మనలో చాలామందికి ఉదయాన్నే వేడివేడి టీ తాగందే రోజు గడవదు. అయితే, కొన్నిసార్లు టీ ఎక్కువైనప్పుడు లేదా చల్లారిపోయినప్పుడు దాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతుంటాం. అలా చేయడం మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పదే పదే టీని వేడి చేసి తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు టీని ఎందుకు తిరిగి వేడి చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు, గ్యాస్ పెరుగుతుంది: టీని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని యాసిడ్ గుణాలు విపరీతంగా పెరుగుతాయి. దీని ఫలితంగా కడుపులో తీవ్రమైన మంట, అసిడిటీ, గ్యాస్ మరియు అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా ఇది కడుపులోని ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

బాక్టీరియా చేరి కడుపునొప్పి రావచ్చు: పాలు, పంచదార కలిపిన టీని కొన్ని గంటల పాటు పక్కన పెడితే అందులో బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇక తయారు చేసిన 3-4 గంటల తర్వాత ఆ టీని మళ్లీ వేడి చేసి తాగితే అందులోని హానికర క్రిముల వల్ల వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
శరీరానికి ఐరన్ అందకుండా పోతుంది: టీని ఎక్కువగా మరిగించడం వల్ల అందులోని ‘టానిన్లు’ అనే రసాయనాలు విడుదలవుతాయి. ఇక ఇవి మనం తినే ఆహారం నుండి శరీరం ఐరన్ ను సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇక దీనివల్ల రక్తహీనత మరియు అలసట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సమయం ఆదా అవుతుందనో, వేస్ట్ కాకూడదనో చల్లారిన టీని మళ్లీ వేడి చేసి తాగడం అసలు మంచిది కాదు. ఎప్పటికప్పుడు తాజా టీని మాత్రమే తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యమూ బాగుంటుంది.
గమనిక: టీని ఎప్పుడూ తయారు చేసిన అరగంట లోపే తాగడం శ్రేయస్కరం. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు పదే పదే టీ తాగే అలవాటును తగ్గించుకోవాలి.
The post మిగిలిపోయిన టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా? జాగ్రత్త.. ఈ సమస్యలు రావచ్చు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.