
మూవీ రివ్యూ: రోమాంచకం
నటీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, వెంకటేష్ కాకమాను, సాయి సోహన్, మణి, ఉపేంద్ర లిమాయే తదితరులు
సినిమాటోగ్రఫీ: పవన్ పాపుల
సంగీతం: వాసుకి వైభవ్
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ
ఎడిటర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి
కథ:
రోమాంచకం అనే స్టార్టప్ కంపెనీ నడుపుకునే అన్వేష్ (సుమంత్ ప్రభాస్) జీవితంలోకి చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక) ప్రవేశిస్తుంది. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ప్రియుడిని కలవడానికి మైథిలి హైదరాబాద్‌కు రావడం వల్ల అన్వేష్, అతని మిత్రబృందం ఒక పెద్ద చిక్కులో పడతారు. అసలు మైథిలికి ఏమైంది? ఆ ఊహించని విపత్కర పరిస్థితి నుంచి ఆ స్నేహితులు ఎలా బయటపడ్డారు? అనేదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.
కథనం:
రోమాంచకం చిత్రాన్ని దర్శకుడు కథ మీద కాకుండా, పరిస్థితుల వల్ల పుట్టుకొచ్చే కామెడీ మీదే పూర్తిగా ఆధారపడి నడిపించాడు. సినిమా మొదలైన కొత్తలో ప్రేక్షకుడు కథలోకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా తొలి అరగంట పాటు సన్నివేశాలు ఎక్కడికక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. దీనికి తోడు ప్రధాన జంట మధ్య నడిచే ప్రేమ ప్రయాణం కూడా కాస్త చిన్నపిల్లల చేష్టల్లా, పెద్దగా పండనట్లు అనిపిస్తుంది. బహుశా జెన్ జీ ఆలోచనా ధోరణి అలాగే ఉంటుందని దర్శకుడు భావించి అలా రాసుకున్నాడేమో. అయితే హీరో చెన్నై వెళ్లడం, అలాగే కథానాయిక హైదరాబాద్‌లో అడుగుపెట్టడం జరిగినప్పటి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది.
ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రేక్షకులకు బ్రేక్ లేకుండా నవ్విస్తుంది.. మధ్యలో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, ఆత్మవిమర్శ లాంటి అంశాలు అంతగా ఆకట్టుకోవు. కానీ ఆ లోపాన్ని హాస్య సన్నివేశాలు కవర్ చేసేస్తాయి. క్లైమాక్స్ కు వచ్చేసరికి కన్ఫ్యూజన్ కామెడీ తారాస్థాయికి చేరుకుంటుంది. ఎక్కడా కూడా సినిమాటిక్ గా, సినిమాటిక్ గా లేకుండా మనం రోజూ మాట్లాడుకునే సహజమైన మాటలు రాయడం ఈ సినిమాకు అతిపెద్ద బలం. అడపాదడపా చిన్నపాటి సాగతీత అనిపించినా, వెంటనే వచ్చే మరో కామెడీ సీన్ ఆ లోపాన్ని మరిపిస్తుంది. లాజిక్‌లు వెతకకుండా కేవలం నవ్వులు, కాలక్షేపం కోరుకునే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది.
నటీనటులు:
సుమంత్ ప్రభాస్ బాధ్యతల్లేని కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా నటించాడు. అతని మాట తీరు, వ్యవహార శైలి కొన్నిచోట్ల విజయ్ దేవరకొండను తలపిస్తాయి. అనంతిక తెరపై చాలా ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ స్నేహితుల బృందం. వెంకటేష్, సాయి సోహన్, మణి తమ వంతు పాత్రలు బాగా పండించారు. అయితే నరేంద్ర రవి తనదైన హావభావాలతో, పంచ్ డైలాగులతో సినిమాకే హైలైట్‌గా నిలిచాడు. పోలీసు అధికారి పాత్రలో కనిపించిన ఉపేంద్ర లిమాయే తనదైన శైలి నటనతో థియేటర్‌లో మంచి నవ్వులు పూయించాడు.
టెక్నికల్ టీం:
వాసుకి వైభవ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్. సినిమా కాస్త నెమ్మదించిన ప్రతిసారీ తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. పవన్ పాపుల కెమెరా పనితనం బాగుంది, పాటల చిత్రీకరణ బాగుంది. అయితే ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ తీసేసి ఉంటే సినిమా ఇంకాస్త వేగంగా అనిపించేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా, చాలా నాణ్యంగా ఉన్నాయి. ఇక దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి స్నేహితుల మధ్య సాగే వినోదాన్ని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలమయ్యాడు. మిగిలిన విభాగాల పనితీరు పర్వాలేదనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా రోమాంచకం.. నీట్ కామెడీ ఎంటర్టైనర్