
అత్యాశ ఎంత దారుణంగా ఉంటుందంటే.. మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుంది.. క్రూరత్వాన్ని నిద్రలేపుతుంది అనటానికి ఈ ఘటన సరైన ఉదాహరణ. కేవలం లక్షన్నర అప్పుకు 11 లక్షల రూపాయలు డిమాండ్ చేసి అమానవీయంగా టార్చర్ చేసిన ఘటన బెంగళూరు సిటీలో వెలుగులోకి వచ్చింది. మహిళలే మహిళను వివస్త్రను చేసి ఫోటో తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో 30 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, వివస్త్రను చేసి, అత్యాచారం చేసి, వీడియో తీసి బెదిరించారు వడ్డీ వ్యాపారులు. లక్షన్నరకు 11 లక్షలు ఇవ్వకుంటే వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
నిందితులను నజాత్ బేగం, రేష్మా బాను, ఆమె భర్త సుహేల్ గా గుర్తించారు. వీరితో పాటు మరో అనుమానితుడు సైఫ్ అనే వ్యక్తిని కూడా విచారిస్తున్నారు.
వ్యభిచార ముఠాకు అమ్ముకుంటాం..
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. ఒక మహిళ నజాత్ నుంచి వారం వారం చెల్లించే ఒప్పందంతో రెండేండ్ల కింద 50 వేల రూపాయలు తీసుకుంది. అదే విధంగా రేష్మా బాను దగ్గర లక్ష రూపాయలు తీసుకుంది. వారం వారం చెల్లిస్తూ వస్తోంది. గత కొద్ది వారాలుగా ఆర్థిక సమస్యలతో డబ్బులు కట్టకపోయే సరికి ఇంత పని చేశారు.
2026 ఆగస్టు 27వ తేదీన.. సదరు మహిళను మెట్రో లేయౌట్ లో ఉన్న తన ఇంటికి పనిఉందని, డబ్బులు ఇస్తానని నజాత్ పిలిపించింది. సాయంత్రం 5.3.0కు మహిళ తన చిన్న కొడుకుతో అక్కడికి చేరుకుంది. ఆ తర్వాత రేష్మ, ఆమె భర్తతో పాటు మరో ఇద్దరు ఆ ఇంటికి చేరుకున్నారు. తీవ్రంగా కొట్టి ఆమెపై అత్యాచారం చేసినంత పని చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితులు మహిళను కత్తితో బెదిరించారు. ఫోన్ డ్యామేజ్ చేశారు. 11 లక్షలు చెల్లించకుంటే వివస్త్రను చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా మహిళను సాయంత్రం 7 గంటలకు తన బాబుతో కలిపి ఆటోలో కుంబల్గోడులో రేష్మా ఇంటికి తీసుకెళ్లారు. కర్రలతో, రాడ్లతో తీవ్రంగా కొట్టి రూమ్ లో బంధించారు.
ఆగస్టు 29న సగం పట్టలు చింపేసి వీడియో తీసి.. వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. అంతే కాకుండా వ్యభిచార ముఠాకు అమ్ముకుంటామని కూడా బెదిరించారు.
ఎలా కాపాడారు..?
మహిళను ఆగస్టు 31న రక్షించారు. పోలీసులకు అలర్ట్ చేసేందుకు వచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది ఆ మహిళ. వాష్ రూమ్ కు వెళ్తానని చెప్పగా.. రేష్మ డోర్ ఓపెన్ చేయడంతో సమీపంలో ఉన్న వ్యక్తుల ద్వారా పోలీసులకు సమాచారం చేరవేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇంటికి వెళ్లి మహిళను కాపాడారు. చంద్ర లేయౌట్ లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆగస్టు 31న నిందితులు నజాత్ బేగమ్, రేష్మా బాను, సుహేల్, సైఫ్ లపై కేసులను నమోదు చేశారు.