భారత్‌లో త్వరలో కొత్త కరెన్సీ నోట్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురానున్నారు. వచ్చే ఏడాదిలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ కరెన్సీ నోట్ల తయారీకి సంబంధించి పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆర్బీఐ ఆహ్వానించింది. అయితే టెండర్లలో కఠిన నిబంధనలు విధించింది.
బిడ్డింగ్‌లో జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది. టెండర్లలో పాకిస్తాన్, చైనాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విక్రేత, సరఫరాదారులను నిషేధించింది. ఈ మేరకు బిడ్డింగ్ కంపెనీలతో పలు ఒప్పందాలపై ఆర్బీఐ సంతకాలు చేయించుకుంది. యూకే, ఆస్త్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.
నిబంధనల కారణంగా చైనా, పాకిస్తాన్‌కు చెందిన కంపెనీలు పాల్గొనలేదు.
రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పేరుతో టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 18తో టెండర్ల ప్రక్రియ ముగియగా.. యూకే నోట్ల తయారీ సంస్థ డీలా రూతో పాటు మరో రెండు విదేశీ కంపెనీలతో ఆర్బీఐ డీల్ కుదుర్చుకుంది. అలాగే పాలిమర్ సబ్‌స్ట్రేట్‌లో జంతువుల కొవ్వు లేదా డీఎన్ఏ లేదని ధృవీకరించాల్సి ఉంటుంది. యూకేతో పాటు పలు దేశాల్లో జంతువుల కొవ్వు వాడుతుండటంతో వివాదాలు చెలరేగాయి.
అత్యవసరంగా సరఫరా చేయాలని ఆర్బీఐ బిడ్డింగ్ విడుదల చేసింది. సుమారు 68 వేల రీముల పాలిమర్ షీట్లు అవసరం అవుతాయని ఆర్బీఐ అంచనా వేసింది. ప్రతీ రీమ్‌లో 500 పాలిమర్ ఫిల్మ్ సీట్లు ఉంటాయి. బిడ్లతో పాటు నమూనాలను కూడా కంపెనీలు సమర్పించాలి. వివిధ వాతావరణ పరిస్థితుల్లో నమూనాలను పరీక్షిస్తారు. అనంతరం అర్హత సాధించినవారికి తుది టెండర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేస్తారు.
యూకేకు చెందిన డీ లా రూ, ఆస్ట్రేలియాకు చెందిన సీసీఎల్ సెక్యూర్, వియత్నాంకు సంబంధించిన మరో కంపెనీ పాలిమర్ షీట్లను సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలతో ఆర్బీఐ ఒప్పందం కుదర్చుకుంది. పరీక్షల తర్వాత తుది కంపెనీని ఎంపిక చేయనుందని తెలుస్తోంది. తొలుత రూ.10, రూ.20 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది.




