
El Nino: ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించే ‘‘ఎల్ నినో’’ మరింత బలపడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) తెలిపింది. ఎల్ నినో 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో రుతుపవనాలు, ఉష్ణోగ్రత, వర్షాలపై ప్రభావం తప్పకుపోవచ్చు. ఎల్ నినో ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో స్పష్టంగా ఏర్పడిందని, రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుందని WMO వెల్లడించింది. 2027 ప్రారంభం వరకు ఎల్ నినో కొనసాగించే అవకాశం దాదాపు 100 శాతంగా ఉండటంతో వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్, నీటి వనరులు వంటి వాతావరణ సున్నిత రంగాలు ముందస్తు సన్నద్ధతను పెంచుకోవాలని సూచించింది.
ఎల్ నినోకు కీలకమైన నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా భారీగా పెరిగాయి. 2026 మే-జూలై మధ్య సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండగా, జూలైలో ఇది 2 డిగ్రీలకు చేరింది. జూలై చివరి నుంచి ఆగస్టు మధ్య వారాల్లో ఈ వ్యత్యాసం సుమారు 2.2 నుంచి 2.6 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. సముద్ర ఉపరితలం కింద పరిస్థితులు కూడా అసాధారణంగా ఉన్నాయి. ఉష్ణమండల పసిఫిక్ లోని కొన్ని ప్రాంతాల్లో జూలై, ఆగస్టు ప్రారంభంలో సముద్రం లోపల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 8 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదయ్యాయి. ఇవన్నీ ఎల్ నినో బలపడేందుకు అనుకూల పరిస్థితులు కల్పించాయని వాతావరణ సంస్థ తెలిపింది.
భారత్‌పై ప్రభావం ఎంత..?
ఎల్ నినో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. కానీ భారత్‌కు ఇది కీలక వాతావరణ సంకేతంగా మారింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. గతంలో అనే సందర్భాల్లో ఎల్ నినో ఏర్పడిన సందర్భంలో భారత్‌లో రుతుపవనాలు చాలా బలహీనంగా మారిన చరిత్ర ఉంది.
2026లో భారత్‌లో ఇప్పటికే సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనా వేసింది. భారత్‌పై ఎల్ నినో ప్రభావాన్ని పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) కొంతవరకు మార్చే అవకాశం ఉందని WMO తెలిపింది. 2026 సెప్టెంబర్-నవంబర్ కాలంలో పాజిటివ్ IOD అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది.
ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం..
చాలా బలమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ ప్రసరణలో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి, కరువు, మరికొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశాలు పెరుగుతాయి. అయితే, ఎల్ నినో ఎంత బలంగా ఉందనే విషయం ఏ దేశంపై ఎంత తీవ్ర ప్రభావం ఉంటుందో నిర్ణయించదు. ప్రాంతీయ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా ప్రభావాన్ని మార్చే అవకాశం ఉందని WMO స్పష్టం చేసింది.