Reading Time: < 1 minute

తిరుమల కొండపైకి మద్యం బాటిళ్లు, బీడీ కట్టలు, పాన్ మసాలాలు… ఇంత దారుణమా గోవిందా..!

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమల కొండను ఎంతో పవిత్రంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. కొండపైకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తారు చాలామంది.అలాంటి పవిత్రమైన తిరుమల కొండపైకి మద్యం బాటిళ్లు, బీడీ కట్టలు, పాన్ మసాలాలు తీసుకెళ్తూ పట్టుబడ్డాడు ఓ కేటుగాడు. భద్రతా సిబ్బంది గురువారం ( సెప్టెంబర్ 3 ) జరిపిన తనిఖీల్లో నిషేధిత వస్తువులు పట్టుబడ్డాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిర్వహించిన ఈ సోదాల్లో ఓ వ్యక్తి నుంచి మద్యం బాటిళ్లు, బీడీ కట్టలు, హాన్స్ ప్యాకెట్లను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

తిరుపతిలోని లీలామహల్ ప్రాంతానికి చెందిన కె. బాబ్జి అనే వ్యక్తి గురువారం తిరుమల కొండపైకి వెళ్తుండగా, అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భద్రతా సిబ్బంది అతని లగేజీని స్కానింగ్ చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా అతని బ్యాగులో దాచిన 9 ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలు, బీడీ కట్టలు, హాన్స్ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. 

భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని, మద్యం బాటిళ్లు, బీడీ కట్టలు హాన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని తిరుమల విజిలెన్స్ అధికారులకు అప్పగించగా, తదుపరి చర్యల నిమిత్తం అతనిని అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు అధికారులు.
 

©️ VIL Media Pvt Ltd.