
- ప్లానింగ్ బోర్డు కమిషన్ వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి
- మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మళ్లీ శారద.. కుడా చైర్ పర్సన్‌గా గుండు సుధారాణి
- మూడు వేర్వేరు జీవోలు జారీ
హైదరాబాద్, వెలుగు: బీసీ సామాజికవర్గానికి చెందిన ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవుల్లో నియమించింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం (ప్లానింగ్ బోర్డు) వైస్ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈమెకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న గద్వాల విజయలక్ష్మి రాజీనామా చేయగా, ప్రభుత్వం దానిని ఆమోదించింది.
అనంతరం ఆమెను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. దీంతో ఖాళీ అయిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్థానంలో సీనియర్ నాయకురాలు, గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సమర్థవంతంగా పనిచేసిన నేరెళ్ల శారదను తిరిగి నియమించారు. అదేవిధంగా కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా జీవోలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి వెంటనే బాధ్యతలు స్వీకరించాలని స్పష్టం చేశారు. ఆమె రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు. ఇక తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన నేరెళ్ల శారద బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
శారద నియామకానికి సంబంధించిన సర్వీసు నిబంధనలు, ఇతర విధివిధానాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ త్వరలోనే ప్రత్యేకంగా జారీ చేయనుందని జీవోలో తెలిపారు. మరోవైపు గుండు సుధారాణి ‘కుడా’ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా, స్థానిక సంస్థల ప్రతినిధిగా పనిచేసిన సుధారాణి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించారు. ఆమె నియామకానికి సంబంధించిన ఇతర విధివిధానాలు, షరతులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ త్వరలో విడుదల చేయనుంది.
ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్‌గా మొదటి మహిళ
సామాజిక సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. నియమితులైన ముగ్గురు బీసీ మహిళలు కావడం గమనార్హం. అలాగే ఉత్తర తెలంగాణలో కీలకమైన కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) సారథ్యాన్ని బీసీలో పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి అప్పగించారు. వరంగల్ నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, మాస్టర్ ప్లాన్ అమలు వంటి కీలక బాధ్యతలను ఆమె పర్యవేక్షించనున్నారు.
నేరేళ్ల శారద గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇదిలా ఉండగా రాష్ట్ర పరిపాలనా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి దక్కడం విశేషం. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు కీలకమైన ప్లానింగ్ బోర్డు పగ్గాలు పురుషులకే దక్కుతూ రాగా, రేవంత్ రెడ్డి సర్కార్ ఆ సంప్రదాయాన్ని మార్చి మున్నురు కాపు వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి ఈ అత్యున్నత బాధ్యతలను అప్పగించింది. కేబినెట్ ర్యాంకుతో కూడిన ఈ పదవి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, బడ్జెట్ ప్రణాళికలు, క్షేత్రస్థాయి అభివృద్ధి సమీక్షల్లో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నియామకాల ద్వారా అటు బీసీ వర్గాల్లోని మహిళా సమాజానికి ప్రభుత్వంలో సముచిత స్థానం
కల్పించినట్లయింది.