Reading Time: < 1 minute
Nandyal School Students Made To Work As Labourers Krishnashtami 2026

కృష్ణాష్టమి 2026 వేడుకల ఏర్పాట్ల పేరుతో విద్యార్థులతో ప్రమాదకరమైన పనులు చేయించిన ఘటన నంద్యాలలో తీవ్ర విమర్శలకు దారితీసింది. హోసింగ్ బోర్డు కాలనీలోని అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణాష్టమి వేడుకల కోసం స్కూల్ యాజమాన్యం ఏర్పాట్లు చేపట్టింది. అయితే స్కూల్ ప్రాంగణంలో ఇప్పటికే పేరుకుపోయిన చెత్తాచెదారం, బండరాళ్లను తొలగించే పనులను కూలీలతో చేయించకుండా.. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులతో చేయించింది.

రాత్రివేళ కాలనీలోని ప్రజలు నిద్రిస్తున్న సమయంలో సుమారు 30 మంది హాస్టల్ విద్యార్థులను బయటకు తీసుకొచ్చి పనులు చేయించింది స్కూలు యాజమాన్యం. విద్యార్థులు పార, సలిక, చీపురు తదితర పనిముట్లతో నేలను చదును చేశారు. అంతేకాదు కొందరు భారీ బండరాళ్లను భుజాలపై ఎత్తుకెళ్లారు. విద్యార్థులతో ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో చెత్తను కూడా శుభ్రం చేయించింది యాజమాన్యం. విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేయించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితిని గమనించిన స్కూల్ సిబ్బంది విద్యార్థులను వెంటనే హాస్టల్‌కు పంపించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థులు కృష్ణాష్టమి వేడుకల ఏర్పాట్లలో పాల్గొనడం సాధారణమేనని స్కూల్ యాజమాన్యం అంటోంది. అయితే వేడుకల ఏర్పాట్ల పేరుతో ప్రమాదకరమైన పనులు, భారీ బండరాళ్ల తరలింపు వంటి పనులను విద్యార్థులతో చేయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై అధికారులు స్పందించి.. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.