Reading Time: 2 minutes
Video: 200 ఏళ్లు.. 5 తరాల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల.. సంబరాలు మామూలుగా లేవుగా..

సాధారణంగా కొడుకు పుడితే సంబరాలు చేసుకోవడం చాలా చోట్ల చూస్తుంటాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం ఆడబిడ్డ పుట్టుకను పండుగలా జరుపుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు తరాలు, దాదాపు 200 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ వంశంలో తొలిసారి ఆడపిల్ల అడుగుపెట్టడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్లీకి చెందిన దహీఫలే కుటుంబంలో ఈ అరుదైన, అందమైన సంఘటన చోటుచేసుకుంది. కల్పన రిషికేశ్ దహీఫలే అనే మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపాయికి గార్గి అని నామకరణం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లి, బిడ్డలకు కుటుంబ సభ్యులు ఊహించని రీతిలో ఘన స్వాగతం పలికారు.

పూల రథంపై ఊరేగింపు..

తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్న సంతోషంతో కుటుంబ సభ్యులు ఓ ప్రత్యేక పూల రథాన్ని సిద్ధం చేశారు. పసికందు గార్గిని, ఆమె తల్లిని ఆ రథంపై కూర్చోబెట్టి భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ వీధుల్లో ఘనంగా ఊరేగించారు. స్థానికులు సైతం ఈ వేడుకలో భాగమై ఆ చిన్నారిపై పూలవర్షం కురిపించారు.

కుటుంబ సభ్యుల భావోద్వేగం

గార్గి తాతయ్య లింబాజీ దహీఫలే మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మా వంశంలో ఆడపిల్ల లేదన్న వెలితి కొన్ని తరాలుగా ఉండేది. ఈ రోజు మా ఇంటికి ఆడబిడ్డ రావడం మా పూర్వజన్మ సుకృతం. ఆ లోటు ఇప్పటికి తీరింది’’ అని ఆనందబాష్పాలతో తెలిపారు. అంతేకాకుండా ‘‘మా ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి నడచివచ్చింది. చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు, కానీ కూతురు ఇచ్చే ఆనందం, అనుబంధం వెలకట్టలేనివి. మా చిన్నారిని కంటికి రెప్పలా, పూవులా చూసుకుంటాం’’ అని గార్గి తల్లిదండ్రులు తెలిపారు.

సమాజానికి బలమైన సందేశం

ఒకప్పుడు లింగ నిష్పత్తి సమస్యలతో వార్తల్లో నిలిచిన ప్రాంతాల్లో, ఆడపిల్ల పుట్టుకను ఇలా బహిరంగంగా, గర్వంగా వేడుకలా జరుపుకోవడం ద్వారా దహీఫలే కుటుంబం సమాజానికి ఒక గొప్ప సానుకూల సందేశాన్ని అందించింది. ఆడబిడ్డ పుడితే భారంగా భావించే సమాజానికి ఈ సంఘటన ఆదర్శంగా నిలుస్తోంది.

వీడియో చూడండి..