Reading Time: 2 minutes
Im Game Movie Review Rating Dulquer Salmaan Nahas Hidayath

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించి, స్వయంగా నిర్మించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఐయామ్ గేమ్’ (I’m Game). మలయాళంలో ‘ఆర్డీఎక్స్’ లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 03, 2026న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

ఐయామ్ గేమ్ కథ:
డేన్ జాన్ (దుల్కర్ సల్మాన్) విపరీతమైన గాంబ్లింగ్ వ్యసనం ఉన్న యువకుడు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై దెబ్బలు తింటున్న కొడుకుని చూసి తట్టుకోలేక, తల్లి మెర్సీ (జయసుధ) తన కష్టార్జితం 60 లక్షల రూపాయలను అతడికి ఇస్తుంది. అయితే ఆ డబ్బును కూడా జాన్ క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆవేశంలో నిర్వాహకులను బెదిరించి ఆ డబ్బు తీసుకుని కారులో పారిపోతూ ఘోర ప్రమాదానికి గురవుతాడు. ఈ ప్రమాదంలో జాన్ తన కుడి చేతిని కోల్పోవడంతో పాటు కోమాలోకి వెళ్తాడు. ప్రాణాలు దక్కించుకున్న అతడికి వైద్యులు మరొక వ్యక్తి చేతిని అమర్చుతారు. అదే సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఇషా (కాయదు లోహర్)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అప్పటినుంచి అతనికి అమర్చిన కొత్త చేయి జాన్ నియంత్రణ తప్పి తన ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఒక రోజు బెట్టింగ్ సెంటర్లో ఉన్న జాన్ వద్దకు డేవిడ్ (మిస్కిన్) రాగానే, ఆ చేయి కత్తి పట్టుకుని అతనిపై తీవ్రమైన కోపంతో దాడికి దిగుతుంది. ఆ చేయి ఎవరిది? డేవిడ్ ను అది ఎందుకు చంపాలనుకుంది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ
చేతికి వేరే ప్రాణం రావడం అనే కాన్సెప్ట్ గతంలో వచ్చిన ‘సవ్యసాచి’, ‘మావీరన్’ సినిమాలను గుర్తుకు తెచ్చినా, ఈ సినిమా ఫస్టాఫ్ ను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. హైదరాబాద్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చాలా డార్క్ గా, సరికొత్త కోణంలో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంగ్లీష్, మలయాళం, తెలుగు, తమిళ భాషల కలయికలో రాసిన సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. వేరొకరి చేయి అమర్చిన తర్వాత అది హీరో కంట్రోల్ తప్పి ప్రవర్తించే ఎపిసోడ్స్, సైలెంట్ గా వర్కౌట్ అయిన హీరో ఎలివేషన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కానీ బ్రేక్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ తో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా కిందకు పడిపోతుంది. దానం చేసిన వ్యక్తి గతం గురించి తెలిశాక, కథా ముగింపును ప్రేక్షకులు సులభంగా ఊహించేయవచ్చు. సెకండాఫ్ పాతకాలపు పగ, ప్రతీకారం ఫార్మాట్‌లోనే సాగుతూ విసుగు తెప్పిస్తుంది. రొటీన్ క్లైమాక్స్ ఫైట్, బలవంతంగా ఇరికించిన బెట్టింగ్ సందేశం సినిమాకు మైనస్ అయ్యాయి. దాదాపు మూడు గంటల నిడివి ఈ కథకు అవసరం లేదు, ఒక 20-30 నిమిషాల సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించి ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేది.

నటీనటుల పనితీరు విషయానికి వస్తే పొగరున్న గ్యాంబ్లర్‌గా, తన చేతిని తనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయుడిగా దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటన కనబరిచి సినిమాను తన భుజాలపై మోశాడు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో విక్కీ పాత్రలో అతిథిగా కనిపించిన ఆంటోని వర్గీస్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించాడు. హీరోయిన్ కాయదు లోహర్ తెరపై అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. విలన్ పాత్రలో మిస్కిన్, చిన్న పాత్రలో సంయుక్త విశ్వనాథ్ తమ పరిధి మేరకు చక్కగా నటించి న్యాయం చేశారు. కదిర్, జయసుధ, వినయ్ పోర్ట్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ మ్యూజిక్ థియేటర్‌లో మంచి ఎనర్జీ తెచ్చింది. జిమ్షి ఖలీద్ కెమెరా పనితనం చాలా షార్ప్ గా ఉండి, సినిమాను విజువల్‌గా రిచ్‌గా చూపించింది. ఎడిటర్ చమన్ చాకో ఫస్టాఫ్‌లో సినిమాను పరుగులు పెట్టించినా, ద్వితీయార్థంలో మూవీని ఇంకా బెటర్ గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండి సినిమాకు సరైన థియేట్రికల్ లుక్ ఇచ్చాయి. దర్శకుడు నహాస్ హిదాయత్ ఒక మంచి ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమాను ప్రారంభించినప్పటికీ, సెకండాఫ్ లో మాత్రం కొత్తగా రిస్క్ తీసుకోలేక పాత ఫార్ములాతో సేఫ్ గేమ్ ఆడాడు.

ఫైనల్లీ ఐయామ్ గేమ్ ఇంట్రెస్టింగ్ గేమ్ విత్ మెసేజ్