
హైదరాబాద్: సినిమా షూటింగ్లకు కేరాఫ్ అడ్రసైన అన్నపూర్ణ స్టూడియోస్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ దూకుడు పెంచింది. సెప్టెంబర్లో తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన వరుస చిత్రాలను పంపిణీ చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సెప్టెంబర్ 3న విడుదలైన దుల్కార్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్.. ఇదే నెలలో మరిన్ని సినిమాలను రిలీజ్ చేసేందుకు లైన్లో పెట్టింది.
హీరో కార్తీ, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రల్లో పీఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ 2 సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే, ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఎపిక్ (EPIC – First Semester) చిత్రాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది. ఇక, అల్లరి నరేష్ లీడ్ రోల్ ప్లే చేసిన రంభ ఊర్వశి మేనక మూవీని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేయడమే కాకుండా, స్వయంగా సహ-నిర్మాతగా (Co-producing) కూడా వ్యవహరిస్తోంది.
ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సినిమాలను అమితంగా ఇష్టపడతారని.. భాషతో సంబంధం లేకుండా గొప్ప చిత్రాలను ఆదరిస్తారని అన్నారు. మా దృష్టిలో, కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పుడు సినిమాకు భాషాపరమైన అడ్డంకులు ఉండవని చెప్పారు.
►ALSO READ | Ramba Oorvasi Menaka Review: సోషియో ఫాంటసీ ‘రంభ ఊర్వశి మేనక’ రివ్యూ.. అల్లరి నరేశ్ నవ్వించాడా? డిజప్పాయింట్ చేశాడా?
మా పంపిణీ చొరవ ద్వారా పారదర్శకమైన, సుస్థిరమైన పంపిణీ వ్యవస్థను నిర్మిస్తూ.. పెద్ద తెరపై తప్పక చూడాల్సిన చిత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నామన్నారు. కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు థియేటర్లలో బలమైన అవకాశాలను కల్పించేందుకు, కమీషన్ ఆధారిత పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలనే అన్నపూర్ణ స్టూడియోస్ విస్తృత దార్శనికతలో భాగంగానే వారి పంపిణీ నెట్‌వర్క్ విస్తరిస్తోందని తెలిపారు.