
డ్రైవింగ్ లైసెన్స్ పొందడమంటే మన దేశంలో అదో పెద్ద పనేమీ కాదు. కాస్త అటూఇటూగా లంచాలు, సిఫార్సులు ఉంటే చాలు చేతికి కార్డు వచ్చేస్తుంది. కానీ విదేశాల్లో.. మరీ ముఖ్యంగా నార్వే లాంటి యూరోపియన్ దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంటే అగ్ని పరీక్షే. భారత్‌కు చెందిన వికాస్ అనే వ్యక్తి నార్వేలో లైసెన్స్ సంపాదించేందుకు పడిన నరకయాతనను సోషల్ మీడియాలో పంచుకోగా.. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం రెండేళ్లు తిరగాల్సి వచ్చిందంట. దీనికోసం అక్షరాలా రూ.6 లక్షలు ఖర్చు చేయడం సామాన్యమైన విషయం కాదు. సరిగ్గా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్న వికాస్.. మన దేశంలో రోడ్డు భద్రతపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి.
India, imagine spending 2 years and ₹6 lakh just to get a driving licence.
That was my struggle in Norway. In 2011, I spent around ₹6 lakh. Today, it would probably be more than ₹10 lakh.
When I came here in 2011, I realised quickly that you really need to drive here -…
— Vinod (@turiyatman) September 4, 2026
2011లో ఉపాధి కోసం నార్వేకు వెళ్లిన వికాస్.. అక్కడ జీవనం సాగించాలంటే డ్రైవింగ్ తప్పనిసరి అని గ్రహించారు. మొదట్లో పక్కింటి వారి సహాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నప్పటికీ.. అక్కడి కఠినమైన నిబంధనలు ఆయనకు చుక్కలు చూపించాయి. కేవలం బండి నడపడం వస్తే సరిపోదు.. మంచు కురిసే దారులు, భయపెట్టే సొరంగాల గుండా, కొండ ప్రాంతాల్లో గంటల తరబడి శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు థియరీ పరీక్షలు, సేఫ్టీ ట్రైనింగ్, గంటల కొద్దీ ప్రాక్టీస్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. చివరకు అన్ని పరీక్షలు ఎదుర్కొని ప్రాక్టికల్ టెస్ట్‌కు వెళితే మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. మరో 2 నెలలు కఠినంగా శ్రమించి, దాదాపు గంటపాటు అధికారుల సమక్షంలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాక కానీ ఆయనకు లైసెన్స్ దక్కలేదు. అప్పట్లోనే రూ.6 లక్షలు ఖర్చు కాగా.. ఇప్పుడు ఆ దేశంలో ఈ ఖర్చు రూ.10 లక్షలు దాటుతుందని తెలిపారు.
ALSO READ : భార్యకు నెలవారి జీతం చెల్లిస్లున్న ప్రభుత్వ ఉద్యోగి.
నార్వేలో ఈ స్థాయిలో కఠిన పరీక్షలు ఎందుకు పెడతారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని వికాస్ పేర్కొన్నారు. అక్కడ కేవలం కారు నడపడం మాత్రమే పరీక్షించరు, ఎదుటివారి ప్రాణాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా రోడ్డును పంచుకోగలరనే నమ్మకం కుదిరాకే లైసెన్స్ ఇస్తారు. ఈ క్రమంలోనే ఆయన మన దేశంలోని రోడ్డు ప్రమాదాలు, డ్రైవింగ్ కల్చర్‌పై ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో 8వ తరగతి కుర్రాళ్లు బైకులు, ట్రాక్టర్లు రోడ్లపై తెగ తిప్పుతున్నా, పోలీసులు పట్టుకుంటే కాస్త ముడుపులు ఇచ్చి తప్పించుకుంటున్న దుస్థితి ఉందన్నారు.
బాధ్యతారహితమైన డ్రైవింగ్ వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వాహనం నడపడం వచ్చా అని కాకుండా.. రోడ్డు బాధ్యత తెలిసేలా మన దేశంలోనూ లైసెన్స్ జారీ విధానం కఠినంగా మారాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.