
- కారులో గంటలోపే గమ్యానికి..
- త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- కిలోమీటర్ కు రెండు సీసీ కెమెరాలు
- అక్టోబర్ నుంచి కొత్తగట్టు టోల్ ప్లాజా ప్రారంభం
- మూడేండ్లలో 68 కి.మీ. నిర్మాణం
కరీంనగర్, వెలుగు: గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్న వరంగల్–జగిత్యాల జాతీయ రహదారిలోని హన్మకొండ–కరీంనగర్ సెక్షన్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. 68 కిలోమీటర్ల మేర ఉన్న ఈ హైవేపై ఈ నెల 5 నుంచి ట్రయల్ రన్ నిర్వహించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను హైవేపైకి మళ్లించడం ద్వారా ఎదురయ్యే ఇబ్బందులతోపాటు వాహనదారుల సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అంచనా వేయనున్నారు. ఒక కిలోమీటర్‌కు రెండు అత్యాధునిక కెమెరాలతో నిత్యం నిఘా ఉండే ఈ రహదారిపై 24 గంటలపాటు రియల్ టైం మానిటరింగ్ చేశారు. శంకరపట్నం మండలం కొత్తగట్టులో టోల్ ప్లాజాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నారు.
త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా ఖమ్మం నుంచి జగిత్యాల వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవేను వరంగల్–జగిత్యాల మధ్య రెండు ప్యాకేజీలుగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వరంగల్–కరీంనగర్ ప్యాకేజీ పనులు రూ.2486 కోట్లతో చేపట్టగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరంతర పర్యవేక్షణతో మూడేండ్లలోపే పూర్తయ్యాయి. హన్మకొండ నుంచి కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ వరకు రోడ్డు పూర్తయినా.. ప్రస్తుతానికి మానకొండూరు సమీపంలోని ఖాదర్‌గూడెం వరకు మాత్రమే ఎన్‌హెచ్‌పై వాహనాల రాకపోకలు సాగించే అవకాశముంది.
నకొండూరు–దుర్శేడు మధ్య పెండింగ్‌లో ఉన్న పనులు కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు నేషనల్ హైవేస్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ మేనేజర్ మల్లం లింగయ్య వెల్లడించారు. పనులన్నీ పూర్తయ్యాక త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
హైవే విశేషాలివే..
ఈ హైవేతో కరీంనగర్–వరంగల్ నగరాల మధ్య ఐదు కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గతంలో రెండు నగరాల మధ్య దూరం 72 కి.మీ. ఉండగా.. ఇప్పుడు 68 కి.మీ.కు చేరింది. గంటకు 100 కి.మీ.ల గరిష్ట వేగంతో వెళ్లేందుకు ఈ హైవేను వీలుగా నిర్మించడం వల్ల కారులో అయితే కేవలం 45 నిమిషాల నుంచి గంటలోపే చేరుకునే అవకాశముంది.
ప్రతీ కిలోమీటర్‌కు రెండు చొప్పున రెండు వైపులా సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కొత్తగట్టు టోల్ ప్లాజా వద్ద నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానించారు. అక్కడ నుంచే 24 గంటల రియల్‌టైం మానిటరింగ్ చేస్తారు. స్పీడ్ నియంత్రణ, నేరాల గుర్తింపునకు ఈ కెమెరాలు పోలీస్ శాఖకు ఉపయోగపడనున్నాయి. కరీంనగర్ నుంచి హన్మకొండ మధ్య హైవేలో వచ్చే ఒకటి, రెండు చోట్ల మినహా ప్రతి గ్రామం వద్ద అండర్ పాస్‌లు, సర్వీసు రోడ్లు నిర్మించారు.
ప్రతీ కి.మీ.కు ఒక ఎమర్జెన్సీ ల్యాండ్ లైన్
ఫోన్(సేవ్ అవర్ సోల్/ఎస్‌వోఎస్) ఏర్పాటు చేశారు. సాయం కోసం వాహనదారులు ఎలాంటి నంబర్ డయల్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ రిసీవర్ ఎత్తగానే నేరుగా కొత్తగట్టు కమాండ్ కంట్రోల్‌కు కాల్ వెళ్లిపోతుంది
హైవే వెంట పారే వరద నీటిని ఒడిసిపట్టేందుకు.. ఎక్కడి నీరు అక్కడే భూగర్భంలోకి ఇంకేలా రహదారి వెంట భారీ ఇంకుడు గుంతలను నిర్మించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరదంతా పొలాలను ముంచెత్తకుండా, రోడ్డు కోతకు గురికాకుండా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి గుంతలను ఏర్పాటు చేశారు.
రాత్రి పూట అవతలి వైపు ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఇవతలి వాహనాల మీద పడకుండా రోడ్డు మధ్యలో మీడియన్ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
కొత్తగట్టు వద్ద టోల్ ప్లాజా నిర్మాణం పూర్తయింది. అక్టోబరు 1 నుంచి ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.