Reading Time: < 1 minute
Revanth Reddy Telangana Voter Deletion Sir Congress Workers Key Comments

Revanth Reddy: కొడంగల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలు, ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు, గౌరవం లభించిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని సీఎం ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇదే తరహా పరిస్థితులు కనిపించాయని, తెలంగాణలోనూ అదే విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

తెలంగాణలో దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించేవారని.. ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా పేదల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం విమర్శించారు. చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కూడా బీజేపీకి సహకరిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉందన్నారు. గ్రామాల వారీగా బీఎల్‌ఏలను సమన్వయం చేసుకుని అర్హులైన పేదల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మండల స్థాయి నాయకులు తమ పరిధిలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఒక్క అర్హుడైన ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సూచించారు.