
స్టార్టప్ కంపెనీల ఒత్తిడికి భయపడి MNCలోకి మారిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అక్కడి పరిస్థితులు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం ఎక్కువ జీతం వస్తుందన్న ఒకే ఒక్క ఆశతో మంచి పేరున్న స్టార్టప్‌ను వదిలి జేపీ మోర్గాన్ కంపెనీలో చేరిన ఆ టెక్కీ.. ఇప్పుడు ప్రతిరోజూ ఉద్యోగానికి రాజీనామా చేయాలనిపిస్తోదంటూ మధనపడుతున్నాడు. కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే ఆఫీసు వాతావరణం తనకు నరకంగా మారిందని, మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజూ ఆఫీసుకు వెళ్లాలనే ఆలోచన వస్తేనే వణుకు పుడుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
అనుకోని మార్పులు.. తీవ్ర పనిభారం
ఎస్డీఈ-2 హోదాలో జేపీ మోర్గన్ లో చేరిన ఆ ఇంజనీర్‌కు ఆరంభం నుంచే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇంటర్వ్యూలలో చెప్పిన దానికి విరుద్ధంగా.. చేరిన తొలి నెలలోనే తన రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఏకంగా 3 సార్లు మారిపోయిందని తెలిపారు. ఆఫీసులో లేని కొత్త టీమ్‌లో తనను చేర్చి, అత్యవసర ప్రాజెక్టును అప్పగించి “మీ అంతట మీరే తేల్చుకోండి” అని మేనేజర్ చెప్పినట్లు వాపోయాడు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పనిచేయాల్సి వస్తోందని.. రాత్రి 10 గంటలకు కూడా మేనేజర్ ఫోన్ చేసి అప్‌డేట్స్ అడుగుతుంటారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతులేని బ్యూరోక్రసీ..
స్టార్టప్‌లో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ పూర్తిగా మాయమైందని టెక్కీ వాపోయాడు. చిన్న చిన్న పనుల కోసం కూడా ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ఎంతో మంది వెనక తిరగాల్సి వస్తోందని, విపరీతమైన బ్యూరోక్రసీ వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నాడు. తనతో పాటు చేరిన సహచరులు కొందరు ఈ ఒత్తిడిని తట్టుకోలేక వెళ్లిపోవటాన్ని చూశానని చెప్పాడు. మేనేజర్ నుంచి తిట్లు తింటూ, సరిగ్గా మాట్లాడేవారు కూడా కరవై పురుగులా చూస్తున్నారని.. ఆఫీస్‌కు వెళ్లాలన్న ఆలోచనే తన శరీరాన్ని వణికించేలా చేస్తోందని వాపోయాడు.
►ALSO READ | వాట్సాప్‌లో కొత్త ఫీచర్: ఇకపై చాటింగ్ చేస్తూనే కరెంట్, గ్యాస్ బిల్లులు కట్టేయొచ్చు
గతమే మేలనిపిస్తున్న వైనం..
కొత్త ఉద్యోగంలో చేరాక తన పాత స్టార్టప్ రోజులే తనకు స్వర్గంలా అనిపిస్తున్నాయని ఆ టెక్కీ పేర్కొన్నాడు. గతంలో స్టార్టప్‌లో పెద్ద ప్రాజెక్టుల విడుదల సమయంలో మాత్రమే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేదని, అప్పుడు దానిని తాను వ్యతిరేకించినా.. ఇప్పుడు మాత్రం ఆ వాతావరణమే ఎంతో నయమనిపిస్తోందని తెలిపాడు. అక్కడ తాను పెద్ద ఫీచర్లు విడుదల చేస్తూ, అందరి గౌరవాన్ని అందుకుంటూ అర్థవంతమైన పనిచేశానని గుర్తుచేసుకున్నాడు సదరు టెక్కీ.
పాత కంపెనీకి తిరిగి వెళ్లే ఆలోచన..
డబ్బు ముఖ్యం కాదని.. మానసిక ప్రశాంతత, గౌరవం అంతకంటే విలువైనవని ఈ అనుభవం తనకు నేర్పిందని ఆ టెక్కీ వెల్లడించాడు. తాను రాజీనామా చేసి పాత కంపెనీకి తిరిగి వెళ్లే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. తాను మానేసేటప్పుడే తన మేనేజర్, టీమ్ లీడ్ మళ్లీ ఎప్పుడైనా రావచ్చని తలుపులు తెరిచే ఉంటాయని చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నాడు. డబ్బుల కోసం ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కోల్పోలేనని తన కార్పొరేట్ జాబ్ పరిస్థితుల గురించి నెట్టింట పంచుకున్నాడు ఈ టెక్కీ.