Reading Time: 2 minutes
Teachers Day 2026 Pm Modi Urges Teachers To Keep Childhood Alive

PM Modi’s Teachers’ Day Message: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం (Teachers’ Day) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ విజేతలతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం, స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ వారితో చర్చించారు.

ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది

విద్యార్థుల ప్రతిభను గుర్తించడంపై ప్రధాని మోడీ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. “ఒకరిద్దరు పిల్లలు చదువులో అంతగా రాణించకపోవచ్చు. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు మీరు ప్రయత్నిస్తున్నారా?” అని ఉపాధ్యాయులను అడిగారు. దీనికి ఉపాధ్యాయులు స్పందిస్తూ.. ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన ప్రతిభ, సామర్థ్యం, సవాళ్లు ఉంటాయని చెప్పారు. ఒక ఉపాధ్యాయుడిగా తరగతిలోని ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి, వారి సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనపై చర్చ

ఈ సంభాషణలో ఓ ఉపాధ్యాయురాలు తన పరిశోధన అంశం బ్రెస్ట్ క్యాన్సర్ అని ప్రధాని మోడీకి తెలిపారు. మహిళలు ఇప్పటికీ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తున్నారని ఆమె చెప్పారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించడం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన తీసుకురావడం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకునేలా మహిళలను ప్రోత్సహించడం వంటి అంశాలపై పనిచేస్తున్నామని వివరించారు.

దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. తాను వారణాసి ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మహిళలు స్వయంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం సంతోషకరమైన పరిణామమని అన్నారు. ఒకే రోజులో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో నమోదైన విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు.

పిల్లల్లో స్క్రీన్ టైమ్ తగ్గించాలి

ప్రస్తుతం పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ పై కూడా ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగం ఒక రకమైన వ్యసనంగా మారుతోందని అన్నారు. పిల్లలను ఆటలు, క్రీడల వైపు మళ్లించడం ద్వారా ఈ సమస్య నుంచి వారిని క్రమంగా బయటకు తీసుకురావచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. పిల్లలు మైదానంలో ఆడేలా ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలను పాఠశాలల్లో మరింతగా నిర్వహించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.

“పుస్తకాలు, సిలబస్ దాటి పిల్లల జీవితాల్లోకి వెళ్లాలి”

ఉపాధ్యాయులతో సంభాషణ ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పుస్తకాలు, సిలబస్‌కు పరిమితం కాకుండా పిల్లల జీవితాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న ప్రధాని.. “బాల్యాన్ని చనిపోనివ్వకూడదు” అని అన్నారు.

పిల్లల్లో సహజంగా ఉండే ఆసక్తి, సృజనాత్మకత, ఆటపాటలు, ప్రశ్నించే తత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. పిల్లల్లోని బాల్యాన్ని కాపాడే విషయంలో టీచర్ అత్యంత కీలకమైన పాత్ర పోషించగలడని ప్రధాని మోడీ అన్నారు. నేషనల్ టీచర్స్ అవార్డ్స్ విజేతలందరికీ ప్రధాని మోడీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల జీవితాలను మెరుగుపరచడంలో వారు చేస్తున్న కృషిని అభినందించారు.