Reading Time: 2 minutes
Ktr Nagarjuna Sagar Water Release Farmers Protest Miryalaguda

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనకు దిగారు. నాగార్జునసాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ NSP గ్రౌండ్‌లో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన ప్రారంభమై వెయ్యి రోజులు అవుతున్నాయని, ఈ కాలంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ వేలాది మంది రైతులు తరలివచ్చి తమకు మద్దతుగా నిలిచారని చెప్పారు.

బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. ఆ సమయంలో రైతులు ధీమాగా బతికారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, రైతుబంధు, రైతుబీమా పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పిన విషయాలే ఇప్పుడు నిజమవుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి రైతులకు మూడుసార్లు రైతుబంధు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. రుణమాఫీ కూడా సంపూర్ణంగా జరగలేదని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడుగుతామని, నిలదీస్తామని స్పష్టం చేశారు. సాగునీటి విడుదలలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాకు శనిలా దాపురించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో శ్రీశైలం నీటిమట్టం 875 అడుగులకు చేరగానే సాగర్‌కు నీటిని విడుదల చేయించామని గుర్తుచేశారు.

ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సరిపడా నాగార్జునసాగర్‌లో నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఎడమ కాలువ ఆయకట్టు రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎడమ కాలువ ఆయకట్టు ప్రజలపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మిగులు జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ అన్నారు. వెలిగొండ నుంచి నీళ్లు వెళ్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెలిగొండకు నీళ్లు తరలించడం గురుదక్షిణగా మారిందని, ముఖ్యమంత్రి మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు చేసిన కేటీఆర్.. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వినాయక చవితిలోగా సాగునీటి విడుదల షెడ్యూల్ ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. పది రోజుల్లోగా షెడ్యూల్ రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.