Reading Time: < 1 minute
Bcci Review Meeting Gautam Gambhir Shubman Gill Wtc Rohit Sharma

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత క్రికెట్ బోర్డు అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ కీలక భేటీలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, కోశాధికారి ప్రభతేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక సీఈఓ హేమాంగ్ అమీన్ ఈ భేటీలో భాగమయ్యారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్ పర్యటన, వచ్చే ఏటా జరగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లలో జట్టు వైఫల్యాలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్, భవిష్యత్ ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో ఆడిన ఆరు టి20ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం ఆందోళన కలిగించింది. అలాగే ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉన్నందున, రాబోయే న్యూజిలాండ్ ఆల్-ఫార్మాట్ సిరీస్ (5 టి20లు, 5 వన్డేలు, 2 టెస్టులు) సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా సమీక్షించారు. ఆటగాళ్ల పనిభారం మేనేజ్‌మెంట్, బ్యాకప్ ఆప్షన్ల ఎంపికపై కోచింగ్ స్టాఫ్ స్పష్టమైన ప్లాన్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని బోర్డు అభిప్రాయపడింది.

ముఖ్యంగా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్ రిటైర్మెంట్‌పై సాగుతున్న ప్రచారాన్ని కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించినప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో ఆయన స్థానంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇకపోతే జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026కు భారత జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఆయనతో పాటు సునీల్ జోషి, హృషికేష్ కనిట్కర్, సుభాదీప్ ఘోష్ కోచింగ్ బృందంలో ఉంటారు. భేటీ అనంతరం గంభీర్, గిల్, అయ్యర్, లక్ష్మణ్ మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా వెనుదిరిగారు.