
చౌటుప్పల్, వెలుగు: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కొండా సురేఖ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు రూ.114 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో సుమారు రూ.525 కోట్లతో రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు.
కొండా సురేఖ వ్యవహారంపై స్పందిస్తూ… ‘‘ఆమె ఏం తప్పు చేశారో తెలియదు కానీ, ఇప్పటికే అధిష్టానాన్ని కలిసి వివరణ ఇచ్చారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి, ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానమే చూసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, సంస్థాన్ నారాయణపురం మండలం కేలోతు తండాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమాని ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ స్థానికంగా ఆసక్తికరంగా మారింది.