
తండ్రి స్నేహితుడి ఇంట్లోనే చోరీ వేసింది.. ఆ బంగారాన్ని ఎవరికీ తెలియకుండా అమ్మేసి, ప్రియుడికి కొత్త బైక్ కొనిచ్చింది.. షోరూమ్‌లో ఇద్దరూ కలిసి రీల్స్ చేస్తూ సెలెబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.. తీరా ఆ వీడియోనే వీరి బండారాన్ని బయటపెట్టింది!
పొల్లాచిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ సీఏ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల ఆర్. జాయ్ ప్రిన్సీ ఉదంతం ఇది. ఆమె తండ్రికి తమిళసెల్వన్ అనే మంచి స్నేహితుడు ఉన్నాడు. ఈ పరిచయంతోనే తమిళసెల్వన్ ఇంటికి రాకపోకలు ఉండేవి. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఇంట్లోకి వెళ్లిన ప్రిన్సీ.. ఆయన ఇంట్లో వార్డ్‌రోబ్‌లో దాచుకున్న 9 సవర్ల బంగారాన్ని కొట్టేసింది. అంతేకాకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగలని స్థానిక షాపులో రూ. 2.5 లక్షలకు విక్రయించింది.
ఆ వచ్చిన డబ్బుతో తన ప్రియుడు.. 20 ఏళ్ల జనగన్ శివ కోసం ఓ కొత్త బైక్‌ను గిఫ్ట్ గా కొనిచ్చింది. షోరూమ్‌లో బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు.. ఆ లవర్స్ జంట చేసిన హడావుడి అంతాఇంతా కాదు. బైక్ చుట్టూ తిరుగుతూ, రీల్స్ చేస్తూ తెగ మురిసిపోయారు. ఈ సోషల్ మీడియా రీల్సే పోలీసుల కంటపడటంతో అసలు సిసలు కథ బయటపడింది.
మరోవైపు నగలు పోయాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో భాగంగా ప్రిన్సీని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రియుడికి బైక్ కొనిచ్చి మురిసిపోయిన ఆ యువతి ఇప్పుడు ఊచలు లెక్కబెడుతుండగా.. ఈ ఘటనలో పరారీలో ఉన్న ప్రియుడు శివ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రేమ పేరుతో చేసిన ఈ పిచ్చి పనికి ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.