Reading Time: 2 minutes
Akhilesh Yadav Ashutosh Ranka Cjp Meeting Lucknow Up Politics

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా ఏదో పెద్దగా జరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కాక్రోక్ జనతా పార్టీ(సీజేపీ) జాతీయ సహ కన్వీనర్ ఆశుతోష్ రాంకా గురువారం లక్నోలో రహస్యంగా కలిశారు. దాదాపుగా ఇద్దరు 90 నిమిషాల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది. తాము ప్రెజర్ గ్రూపుగా ఉంటామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించిన సీజేపీ ఇప్పుడు అఖిలేష్‌తో భేటీ కావడం, అది కూడా యూపీ ఎన్నికల ముందు భేటీ కావడం కీలకంగా మారింది.

గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎస్పీ ప్రధాన కార్యాలయం సమీపంలోని జనేశ్వర్ మిశ్రా ట్రస్ట్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ భేటీపై అటు ఎస్పీ, ఇటు సీజేపీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సీజేపీ ప్రభుత్వ పాఠశాలల్ని బాగు చేయాలని ‘‘ఫిక్స్ ది స్కూల్’’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించవద్దని యూపీ, రాజస్థాన్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

రాజస్థాన్ తర్వాత సీజేపీ యూపీని టార్గెట్ చేసిందా?

నిజానికి సీజేపీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే స్కూళ్లలోని సమస్యల్ని ఎత్తిచూపుతోందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు రాజస్థాన్, మహారాష్ట్ర తర్వాత యూపీని సీజేపీ టార్గెట్ చేసిందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పేపర్ లీక్, విద్యా వ్యవస్థ సమస్యల్ని లేవనెత్తాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్‌లో ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన అశుతోష్ రాంకా బృందంపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడింది బీజేపీ గుండాలే అని సీజేపీ ఆరోపించించింది. గ్రామస్తులు మాత్రం తమకు ఏ పార్టీలో సంబంధం లేదని చెప్పింది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ పాఠశాలల్లో పర్యటించేందుకు సీజేపీ సిద్ధమవుతుందా? దీనికి అఖిలేష్ యాదవ్ నుంచి మద్దతు కోరిందా? అనే అనుమానాలు వ్యక్తమివుతున్నాయి. యూపీలో వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్న ఈ సమయంలో ఆ రాష్ట్రంలో పెద్ద ఉద్యమానికి సీజేపీ సిద్ధమై, రాజకీయ రంగు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నీట్ పేపర్ లీక్ జంతర్ మంతర్ నిరసనల సమయంలో అశుతోష్ రాంకా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం యోగిని సవాల్ చేస్తూ హెచ్చరించారు. రాష్ట్రంలో పేపర్ లీక్ ఆగకపోతే జంతర్ మంతర్ కన్నా పెద్ద ఉద్యమాన్ని చేపడుతామని ప్రకటించాడు. ఇప్పుడు అఖిలేష్‌తో గంటన్నర పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించాడు.