
RG Kar Case: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పనిహాటి మున్సిపల్ చైర్మన్ సోమనాథ్ డేపై దాడి జరిగింది. నార్త్ 24 పరగణాల జిల్లాలో ఆయనను పోలీసులు అరెరస్ట్ చేశారు. ఆయనపై ప్రజలు రాళ్లు, ఇటుకలు, గుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు.
2024లో ఆర్జీ కర్ ఆస్పత్రిలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ వైద్యురాలి మృతదేహాన్ని హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం, ఆధారాలు ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై సోమనాథ్ డేను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న ఇతడిని బెంగళూర్‌లో అరెస్ట్ చేసి, గురువారం బెంగాల్ తీసుకువచ్చారు. ఖర్దహ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
దీని తర్వాత కోర్టుకు తరలించిన పోలీసులు సోమనాథ్ డేను కస్టడీకి కోరారు. డేను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో దాడి జరిగింది. ఆయన తలకు హెల్మెట్ పెట్టి బయటకు తీసుకువస్తుండగా ప్రజలు గుడ్లతో దాడి చేశారు. బాధితురాలికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రమేయం ఉన్న మాజీ పనిహాటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, మాజీ కౌన్సిలర్ సంజీబ్ ముఖోపాధ్యాయ్ ఇప్పటికే జైలులో ఉన్నారు.