Reading Time: 2 minutes

హాంకాంగ్ ప్లేయర్లకు స్మృతి మంధానా పెప్ టాక్.. హర్మన్‌ప్రీత్ ఆటోగ్రాఫ్‌లు అదుర్స్!

Caption of Image.

Smriti Mandhana: మహిళల ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత, టీమిండియా ఆటగాళ్లు మైదానం బయట తమ ఉదారతతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత హాంకాంగ్ క్రికెటర్లను భారత జట్టు ప్రత్యేకంగా తమ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించింది. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి భారత జట్టుతో తలపడిన హాంకాంగ్ క్రీడాకారిణులు, ఈ సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్లను నేరుగా కలిసి మాట్లాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఆత్మీయ కలయిక: 

మైదానంలో స్మృతి మంధాన ప్రత్యర్థి ప్లేయర్లతో ముచ్చటించగా, అనంతరం హాంకాంగ్ జట్టును భారత డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ భారత్ స్టార్ ఆటగాళ్లు దీప్తి శర్మ, రిచా ఘోష్, భారతి ఫుల్మాలి, ప్రతికా రావల్ తదితరులు హాంకాంగ్ క్రికెటర్లతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి కావాల్సిన బ్యాటింగ్, బౌలింగ్ మెళకువలు, మ్యాచ్ సన్నాహకాల గురించి ఇండియన్ ప్లేయర్లు వారికి వివరించారు. హాంకాంగ్ క్రీడాకారిణులు కూడా తమ సందేహాలను అడిగి తెలుసుకుంటూ భారత స్టార్స్ నుంచి విలువైన సూచనలు స్వీకరించారు.

ఆటోగ్రాఫ్‌లు, జెర్సీల మార్పిడి: 

భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఈ కలయికలో పాల్గొని హాంకాంగ్ ప్లేయర్లకు మర్చిపోలేని అనుభూతిని అందించింది. ఆమె ఎంతో ఓపికగా వారి మ్యాచ్ బాల్స్, జెర్సీలపై ఆటోగ్రాఫ్‌లు ఇచ్చింది. అంతేకాకుండా హాంకాంగ్ కెప్టెన్‌తో జెర్సీలను మార్చుకుని క్రీడా స్ఫూర్తిని చాటుకుంది. తొలిసారి టీమిండియా లాంటి దిగ్గజ జట్టుతో మ్యాచ్ ఆడటం, ఆపై డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవాలను పంచుకోవడం తమకు ఎంతో నేర్పించిందని హాంకాంగ్ ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు.

ALSO READ : తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు చూపించిన రోహిత్.. 

నెక్స్ట్ పాకిస్థాన్‌తో బిగ్ ఫైట్: 

ఈ మ్యాచ్‌లో టీమిండియా 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. స్మృతి మంధాన (124) అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఉమెన్స్ టీ20ల్లో భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో మంచి ఊపుమీదున్న  టీమిండియా మహిళల జట్టు, రేపు (శనివారం) జరగబోయే హై-వోల్టేజ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడటానికి సిద్ధమవుతోంది.

©️ VIL Media Pvt Ltd.