
- మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సమాన వెయిటేజీ?
- లాంగ్వేజ్ అభ్యర్థులకు 60 మార్కుల ఆప్షనల్ పేపర్ ఇచ్చే యోచన
- నిపుణుల కమిటీ ఏర్పాటుకు అనుమతి కోరిన విద్యాశాఖ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) పేపర్-2 పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పరీక్ష సరళిని మార్చి.. ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాలని టీచర్ల సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆలోచనలు చేస్తోంది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు సబ్జెక్టు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ తాజాగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
అసలు సమస్య ఇది..
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం.. 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు తప్పనిసరిగా టెట్ పేపర్-2 పాస్ కావాలి. స్టేట్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉంది. అయితే, ప్రస్తుత టెట్ పరీక్షా సరళిలో మార్కుల కేటాయింపుతో మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది జులైలో రిలీజైన టెట్ ఫలితాల్లో పేపర్ 2లో మొత్తం 78,899 మంది పరీక్ష రాస్తే.. కేవలం 26,954 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఈ పరీక్షలో ప్రతిఏటా 30 నుంచి 35శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వానికి, విద్యాశాఖ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మ్యాథ్స్, సైన్స్ టీచర్ల కోసం నిర్వహించే పేపర్-2 ఆప్షనల్ సబ్జెక్టులో మొత్తం 60 మార్కులు ఉండగా.. అందులో మ్యాథ్స్కు 30 మార్కులు, ఫిజికల్ సైన్స్కు 15, బయోలాజికల్ సైన్స్కు 15 మార్కులు కేటాయిస్తున్నారు. దీన్ని ఏపీ టెట్ తరహాలో ఈ మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున కేటాయించాలని టీచర్ల సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. లాంగ్వేజ్ పండిత అభ్యర్థుల కోసం లాంగ్వేజీని ఒక ప్రత్యేక ఆప్షనల్ పేపర్గా గుర్తించాలని, దానికి 60 మార్కుల వెయిటేజీ ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుత విధానంలో వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలనే
డిమాండ్ కొనసాగుతోంది.
కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం..
టీచర్ల సంఘాల నుంచి వచ్చిన ఈ విజ్ఞప్తులను పరిశీలించడానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనికోసం సర్కారు అనుమతి తీసుకొని.. ముందుకు పోవాలని నిర్ణయించారు. ఈ కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగానే టెట్ పేపర్-2 స్ట్రక్చర్లో మార్పులు చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. ఒకవేళ ఈ మార్పులు అమలైతే భవిష్యత్తులో (ప్రస్తుతం జరిగేది కాదు..) జరిగే టెట్ పరీక్షలు కొత్త విధానంలోనే ఉండే అవకాశం ఉంది.