Reading Time: 2 minutes

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు రిలీజ్‌కు బ్రేక్… చివరి నిమిషంలో ఎందుకు ఆపేశారంటే?

Caption of Image.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’. ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 3) మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్ డే రోజు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తెలుగు వెర్షన్ షోలు చివరి నిమిషంలో ఆగిపోయాయి.

షోలు ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి?

పాన్-ఇండియా రేంజ్‌లో భారీగా ప్లాన్ చేసిన ఈ సినిమా తెలుగు వెర్షన్ కంటెంట్ (KDM) సమయానికి థియేటర్లకు చేరకపోవడంతో సెప్టెంబర్ 3 ఉదయం షోలు అన్ని చోట్లా రద్దయ్యాయి. దీంతో ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్ నుంచి కూడా షోలను తొలగించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు తెలుగు షోలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

చిత్ర యూనిట్ ప్రకటన..

మరో వైపు ఈ అనూహ్య పరిణామాలపై ఈ మూవీ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. పలు సాంకేతిక కారణాలతో ‘ఐ యామ్ గేమ్’ తెలుగులో విడుదల ఆలస్యం అవుతోందని తెలిపింది. త్వరలోనే సమస్యను పరిష్కరించి త్వరలోనే తెలుగు వెర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారికంగా వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపింది. అయితే మలయాళ వెర్షన్ ఇప్పటికే ప్రదర్శించబడుతోంది

భారీ అంచనాలతో..

ఇదిలా ఉంటే, ‘ఐ యామ్ గేమ్’పై సినిమాకు ముందు నుంచే ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం దుల్కర్ సల్మాన్–నహాస్ హిదాయత్ కాంబినేషన్. ‘RDX’తో యాక్షన్‌ను అదిరిపోయే స్థాయిలో తెరకెక్కించిన నహాస్.. ఈసారి దుల్కర్‌తో ఎలాంటి కథను చెప్పబోతున్నారన్నది ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటించగా, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కదిర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

ఈ చిత్రాన్ని కామెడీ, రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్, గేమింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసిన థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ఆకర్షణగా నిలవనుంది. కానీ భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన తెలుగు ప్రేక్షకులకు తొలిరోజే షోల రద్దు రూపంలో ఊహించని షాక్ తగిలింది. మరి ఈ సమస్యలను పరిష్కరించుకొని ‘ఐ యామ్ గేమ్’ తెలుగు వెర్షన్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.