
- విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ఓఎస్డీ
వేములవాడ, వెలుగు : శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కలెక్టర్ గరిమా అగ్రవాల్, టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన రివ్యూలో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయంలో మరో సమావేశం నిర్వహించి, తదుపరి టెండర్ ప్రక్రియకు వెళ్లాలని నిర్ణయించామని, టెండర్లు పూర్తయిన తదుపరి మరోసారి సమావేశమై రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు గడువును ఖరారు చేస్తామన్నారు. సమావేశంలో ఆర్డీవో కేఎస్ బి.కుమారి, ఆర్అండ్‌బీ ఎస్ఈ భీమ్లానాయక్, ఈఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.